లోకేష్ శాఖలో అక్రమాలపై కోర్టుకెళ్తాం: జీవీఎల్

ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ స్వయంగా చూస్తున్న ఐటీ శాఖలో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్లబోతున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో, వాటి వివరాలు ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వమంటే ఇవ్వడం లేదని జీవీఎల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల వద్దకు చేరాల్సిన సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఐటీ కంపెనీల పేరుతో ఏపీలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ప్రోత్సాహకాల ముసుగులో షెల్‌ కంపెనీలు సృష్టించారని విమర్శించారు. ఐటీ శాఖలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఏమీలేవని ద్వాజమీట్టుటు ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారని దయ్యబట్టారు. వేల కోట్లు చేతులు మారాయని చెప్పడానికి 2014 నుంచి విడుదలైన జీవోలే ఉదాహరణ అని స్పష్టం చేసారు.

2014 నుంచి 2020 వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జీవోలు విడుదల చేశారని జీవీఎల్ ఆరోపించారు. అనేక సంస్థలను తెచ్చారని, ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్ల డబ్బులు దండుకున్నారని వివరించారు. ల్యాండ్‌లు నామమాత్రపు ధరలకు ఇచ్చి మూడేళ్ల తర్వాత కమర్షియల్‌ రేట్లకు అమ్ముకోవచ్చని కూడా చెప్పారని తెలిపారు.

 తక్కువ ధరకు భూమిచ్చి ఎక్కువ ధరకు అమ్ముకునే విధంగా వీలు కల్పించారని ఆరోపించారు. ఐటీ శాఖలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. జీవోల పేరుతో ప్రజలను మాయ చేశారని వ్యాఖ్యానించారు. తాము అడిగిన సమాచారాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.