తెలంగాణలో స్కూల్స్, థియేటర్స్ బంద్

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా  తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది.  ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసివేయనున్నారు.    

అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం పదోతరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రేపు, ఎల్లుండి కూడా శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేస్తూ ఈ వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కరోనాపై భయం, ఆందోళన వద్దని ప్రజలకు భరోసా ఇచ్చారు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చకు కూడా సిద్దమే అని చెప్పారు. 

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ వైరస్‌ వల్ల కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారని కేసీఆర్‌ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వారి నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్‌ చెప్పారు.