హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్‌

నోవెల్‌ కరోనా వైరస్‌ విజఅంభిస్తున్న నేపథ్యంలో... అగ్రరాజ్యం అమెరికా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 

కరోనా నియంత్రణకు ఫెడరల్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెబుతూ నేషనల్‌ ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. వైరస్‌ నియంత్రణకు 50 బిలియన్‌ డాలర్ల నిధిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. రిలీఫ్‌ ప్యాకేజీ గురించి ఉభయసభల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. 

ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవరోధాలను అధిగమిస్తామని భరోసా వ్యక్తం చేశారు. ఎలాంటి వనరులను కూడా వదిలేది లేదని స్పష్టం చేశారు. తన ఆదేశాల మేరకు కార్నివాల్‌, రాయల్‌ కరేబియన్‌, నార్వేయన్‌, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌లను 30 రోజుల పాటు నిలిపేసినట్లు ట్రంప్‌ తెలిపారు.  

 కాగా, భారత్‌లో అన్ని అమెరికా కాన్సులేట్లను మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కరోనా ధాటికి వణికిపోతున్న అమెరికా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇప్పటికే యూరప్‌కు రాకపోకలను నిషేధించింది. తాజాగా భారత్‌లో ఉన్న అన్ని అమెరికా కాన్సులేట్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 

సోమవారం నుంచి అన్ని రకాల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నామని, వీసా ప్రాసెస్‌ రీ షెడ్యూల్‌ చేసుకోవాలని కోరింది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికన్‌ ఎంబసీ ప్రకటించింది. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు వీసా సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది.