మోదీ ప్రతిపాదనకు పాక్ సానుకూల స్పందన 

కరోనా వైరస్‌పై పోరాడేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) పటిష్ట వ్యూహాన్ని రూపొందించాలని, ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు మార్గాలను సార్క్ దేశాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు పాక్ 'సై' చెప్పింది. 

సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటామని పాకిస్థాన్ ప్రకటించింది. 110 దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోరాదని మోదీ శుక్రవారంనాడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌తో పోరాడేందుకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించాలని సార్క్ దేశాల నేతలకు పిలుపునిచ్చారు. 

'మన ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు మార్గాలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనం చర్చించవచ్చు. కలిసికట్టుగా మనం ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలవవచ్చు, ఆరోగ్యకరమైన భూ మండలం కోసం కృషి చేయవచ్చు' అని మోదీ ఆ ట్వీట్‌లో ప్రతిపాదన చేశారు. 

భూ మండలమంతా కోవిడ్-19 నోవల్ కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోందని, దీనితో పోరాడేందుకు వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు, ప్రజలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ మందికి ఆవాసమైన దక్షిణాసియా తన ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ అవకాశాన్నీ వదులుకోరాదని సూచించారు.

మోదీ ప్రతిపాదనపై వెంటనే పాక్ స్పందించింది. ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో కరనో వైరస్‌ను సమన్వయంతో ఎదుర్కొవాలని, దీనిపై చర్చిచేందుకు జరిగే సార్క్ దేశాల వీడియా కాన్ఫరెన్స్‌లో  పాక్ పాల్గొంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అయిషా ఫరూఖీ ధ్రువీకరించారు. తమ దేశం తరఫున ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు జాఫర్ మీర్జా హాజరవుతారని ఆమె తన అధికార ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు.