దిగ్బంధం దిశగా రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు    

భారత్‌లో కరోనా కోరలు చాస్తుండడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు  మహమ్మారిని కట్టడి చేసేందుకు షట్‌డౌన్‌ మోడ్‌లోకి వెళ్లాయి. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లను మూసివేయడంతోపాటు ప్రజా, క్రీడా కార్యక్రమాలను నిలిపివేశాయి. ఐపీఎల్‌ వాయిదా పడగా,  భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దయింది. ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఐపీఎల్‌తో పాటు అన్ని క్రీడా కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. 

కర్ణాటకలోని కలబురిగిలో దేశంలోనే తొలి కరోనా మరణం నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో మరొకరు మృతిచెందారు. కరోనా నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది.  వారంపాటు అన్ని యూనివర్సిటీలు, థియేటర్లు, మాల్స్‌, పబ్‌లు, క్లబ్‌లను మూసివేస్తున్నట్లు సీఎం యెడియూరప్ప ప్రకటించారు. మరోవైపు, ఈ నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని బీహార్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే జూలు, పార్క్‌లనూ మూసివేయాలని నిర్ణయించింది. 

ఇంకోవైపు, ముంబై, నవీముంబై, పుణే, పింప్రి, నాగ్‌పూర్‌లలో థియేటర్లు, జిమ్‌లు, స్విమింగ్‌పూల్స్‌, మాల్స్‌ను మూసివేయాలని మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈనెల 22 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఒడిశా సర్కారు కరోనాను విపత్తుగా ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ సదస్సులు, సమావేశాలు, వర్కషాప్‌లను రద్దుచేసింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లను మూసివేయాలని ఆదేశించింది.  

కరోనా నేపథ్యంలో ఐఐటీ-కాన్పూర్‌ ఈ నెల 29 వరకు అన్ని తరగతులు, పరీక్షలను నిలివేసింది.  ఈ నెల 15లోగా హాస్టళ్లు ఖాళీచేసి వెళ్లాలని ఐఐటీ ఢిల్లీ తమ విద్యార్థులను ఆదేశించింది. జేఎన్‌యూ కూడా ఈ నెలాఖరు వరకు తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఇజ్రాయెల్‌, దక్షిణకొరియా, శ్రీలంక దేశాలకు సర్వీసులను నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయించింది.

దేశంలో కరోనా కేసులు 82కి పెరిగినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ఇందులో 16 మంది ఇటాలియన్లు కాగా, ఒకరు కెనడాకు చెందినవారు. అయితే కరోనా వైరస్‌ హెల్త్‌ఎమర్జెన్సీ కాదని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. చైనాతోసహా, వివిధ దేశాల నుంచి ఇప్పటివరకు 1,031 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు తెలిపారు. ఇరాన్‌, ఇటలీలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకొస్తామని పేర్కొన్నారు. కరోనా బాధితులను కలిసిన 4,000 మందిని క్వారెంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు. 

కాగా, బెంగళూరు క్యాంపస్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగికి కరోనా సోకినట్లు గూగుల్‌ సంస్థ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా చైనా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నది. దీంట్లో భాగంగా.. సాధారణ ప్రజలు ఎక్కువ గా తిరిగే బస్సులు, లిఫ్టులను ఆ దేశ అధికారులు అతినీలలోహిత (ఆల్ట్రావైలేట్‌-యూవీ) కాంతితో శుద్ధి చేస్తున్నా రు.