వివిధ దేశాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల మూసివేత  

దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 82కు చేరిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లోని చెక్ పోస్టులను మూసివేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

వివిధ దేశాల సరిహద్దుల్లో 37 ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టులుండగా, 19 చెక్ పోస్టుల్లోనే శనివారం అర్దరాత్రి వరకు అనుమతించాలని హోంశాఖ కోరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కాటుకు 5వేల మంది మరణించడంతోపాటు భారతదేశంలో ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించింది. 

మార్చి 15వతేదీ అర్దరాత్రి నుంచి ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దు, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని చెక్ పోస్టులను మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. 

నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీయులు మన దేశంలోకి రాకుండా నిరోధించాలని హోంశాఖ ఆదేశించింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి భారత్ కు వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని కేంద్రం ఆదేశించింది.