సుప్రీం కోర్ట్ లో న్యాయవాదులకు మాత్రమే ప్రవేశం   

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19)పై సుప్రీంకోర్టు కూడా దృష్టి సారించింది. కేవలం అత్యవసర కేసులపై మాత్రమే విచారణ జరపాలని, న్యాయవాదులు మినహా ఇతరులను కోర్టు గదుల్లోకి అనుమతించరాదని నిర్ణయించింది. 

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన సలహాను సుప్రీంకోర్టు పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుని, ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండడంతో విచారణ సమయంలో కోర్టు హాల్‌లోకి కేసుకు సంబంధించిన లాయర్, లిటిగెంట్స్ తప్ప మరెవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణ కోసం సుప్రీం కోర్టు నిర్వహణలో తీసుకోవాల్సిన మార్పులపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే… పలువురు న్యాయమూర్తులు, లాయర్లు, కేంద్ర ఆరోగ్య, న్యాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. 

ప్రస్తుతం హోళీ సెలవుల్లో ఉన్న సుప్రీం కోర్టు సోమవారం నుంచి తిరిగి విచారణలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కోర్టు హాలులోకి జనాల రాకను తగ్గించేందుకు పై నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని కేసుల్లో అవసరమైతే టెక్నాలజీ సాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా నిందితుల విచారణ వంటివి చేపట్టవచ్చని సీజేఐ అభిప్రాయపడ్డారు.