కవిత ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న కేసీఆర్!

రాజకీయాలలో గెలుపోటములు సహజం. ముఖ్యమంత్రి చంద్రశేఖరావు సహితం అటువంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయితే గత లోక్ సభ ఎన్నికలలో నిజామాబాదు నుండి రెండో సారి పోటీచేసిన కుమార్తె కవిత ఓటమిని మాత్రం జీరించుకోలేక పోతున్నట్లు కనిపిస్తున్నది. 

తెలంగాణ నుండి ఎన్నికలు జరిగిన రెండు స్థానాలకు సహితం ఆయన ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థుల తీరు కవిత ఓటమిని దృష్టిలో ఉంచుకొనే చేసిన్నట్లు స్పష్టం అవుతున్నది. కవిత ఓటమిని ఒక విధంగా ఆయన ఆవ్యక్తిగత ఓటమిగా తీసుకొంటున్నట్లు వెల్లడి అవుతున్నది. 

కవితపై గెలుపొందిన బిజెపి అభ్యర్థి డి అరవింద్ ప్రాబల్యాన్ని ఆ జిల్లాలో కట్టడి చేయడంతో పాటు, అందుకు సహకారం అందించిన వారిని సహితం కట్టడి చేయాలనే ఎత్తుగడ ఆయనలో కనిపిస్తున్నది. 

సొంత పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తిరుగుబాటు చేసిన మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కుమారుడు అరవింద్ కావడం గమనార్హం. ఆ జిల్లాలో ప్రస్తుతం నాయకత్వం సంక్షోభాన్ని టి ఆర్ ఎస్ ఎదుర్కొంటున్నది. అందుకనే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసిన్నట్లు కనిపిస్తున్నది. 

వాస్తవానికి పార్టీలో చేరినప్పుడు ఆయనను శాసన మండలికి పంపి సభాపతిగా చేయవచ్చని అందరు అనుకున్నారు. రాజ్యసభకు పంపుతామని పలువురికి స్వయంగా కె సి ఆర్ హామీ ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. అయినా సురేష్ రెడ్డిని ఇప్పుడు రాజ్యసభకు తీసుకు వెళ్లడం వెనుక నిజామాబాదు జిల్లాలో అరవింద్ పలుకుబడిని అదుపు చేయడమే అని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

లోక్ సభ ఎన్నికలలో కవిత వ్యవహారశైలి పట్ల విముఖంగా ఉన్న అధికార, ప్రతిపక్షాలకు చెందిన వారంతా బిజెపి అభ్యర్ధికి మద్దతు ఇచ్చారు. అందుకు డి శ్రీనివాస్ కూడా ప్రధాన కారణంగా కేసీఆర్ భావిస్తున్నారు. 

గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న తనను తన సొంత జిల్లా నుండి ఎంపీగా ఉన్న సమయంలో కవిత లెక్కచేయక పోవడం, పైగా పలు సందర్భాలలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే శ్రీనివాస్ పార్టీపై ఎదురు తిరిగారని చెబుతున్నారు. 

కుమార్తె ఓటమి ముందే గ్రహించిన పోలింగ్ కు ముందుగా అదే జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నేత మండవ వెంకటేశ్వరావు ఇంటికి స్వయంగా వెళ్లి, టి ఆర్ ఎస్ లో చేరి కుమార్తెకు మద్దతు ఇచ్చేటట్లు చేసుకున్నారు. ఆయన రెండు రోజులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. 

మరోవంక అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న సామజిక వర్గానికే చెందిన కె కేశవరావుకు సీట్ నిరాకరిస్తే ఆ వర్గంలో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రహించి ఆయనకు మరోసారి సీట్ ఇవ్వక తప్పలేదు. ఇప్పటికే రెండు సార్లుగా రాజ్యసభ సభ్యుడుగా ఉంటున్న ఆయన వయస్సు 80 సంవత్సరాలు. 

ఆయన పేరుకు పార్టీ పార్లమెంటరీ పార్టీ అధినేత అయినప్పటికీ అక్కడ పెత్తనం అంతా కేటీఆర్ దర్శకత్వంలో యువ ఎంపీలు చేస్తున్నారు. ఒక విధంగా ఆయన అసంతృప్తిగా కూడా ఉన్నారు. కానీ ప్రస్తుత తరణంలో అటువంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టడానికి కేసీఆర్ సాహసం చేయలేక పోయారు. 

కుమార్తె కవితను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా, వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ ఎంపిక చేసారని చెబుతున్నారు. త్వరలో కుమారుడికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పడానికి అదును కోసం ఎదురు చూస్తున్న ఆయన ఆమెను ఇప్పుడు ఢిల్లీకి పంపడం పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.