ఐపీఎల్ ను నిషేధించిన ఢిల్లీ ప్రభుత్వం  

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ విష‌యంలో ప‌లు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఐపీఎల్‌ని నిషేధిస్తున్నట్లు ప్ర‌క‌టిస్తున్నాయి. 

ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఐపీఎల్‌ని నిషేధించడంతో పాటు టిక్కెట్ల అమ్మకాన్ని కూడా నిషేదించింది. తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా ఐపీఎల్‌ని నిషేధిస్తున్నట్లు  అధికారికంగా  ప్ర‌క‌టించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ సహా అన్ని ఆటలపై నిషేధం విధించింది. 

కరోనా విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. 200 అంతకు మించి ప్రేక్షకులు హాజరయ్యే ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు, మార్చ్ 31 వరకు విద్యాలయాలు, సినిమా థియేటర్లను మూసివేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ఢిల్లీలో తాజాగా మ‌రో పాజిటివ్ కేసు న‌మోదైంది. ఇటీవ‌ల ఫ్రాన్స్‌, చైనాకి వెళ్ళొచ్చిన వ్య‌క్తి టెస్ట్ చేయ‌గా పాజిటివ్ అని తేలింది. దీంతో ఢిల్లీలో 6 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, భార‌త్‌లో 76 కేసులు న‌మోదైన‌ట్టు తెలుస్తుంది.  ఎవ‌రు గుంపులు గుంపులు గా ఏర్పడకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.