కేంద్రంపై నిందలు వేయడం కేసీఆర్ కు తగదు 

ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ హితవు చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్​పై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ అన్ని రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉందని స్పష్టం చేశారు.  తెలంగాణ వాసిగా రాష్ట్రాభివృద్ధిని తాను కోరుకుంటున్నానని చెబుతూ . కేంద్రం నిజంగా రాష్ట్రానికి సాయం చేయకపోతే అన్ని పార్టీలతో కలిసి `చలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిద్దామని, తాను కలిసి వస్తానని సవాల్ చేశారు. 

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్, జాతీయ రహదారులు, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం,  11 సాగునీటి​ ప్రాజెక్టులు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళా, రైతు, ఉద్యోగుల వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టారు? వాటి లెక్క చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజాసింగ్​ డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్​ ఫేజ్​ –2కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడానికి కారణాలేమిటో చెప్పాలని కోరారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ మంచి స్కీమ్​లని, ఈ స్కీమ్​ల​లో కేంద్రం నిధులు ఉన్నాయో లేదో చెప్పాలని నిలదీశారు. పెళ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే బాగుంటుందని సూచించారు. 

కేసీఆర్​ కిట్​లో కేంద్రం ఇస్తున్న డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ప్రధానమంత్రి మాతృవందన స్కీమ్​ కింద తెలంగాణకు వచ్చిన రూ.75.81 కోట్లను ఎలా వినియోగించారో చెప్పాలని ప్రశ్నించారు.  ప్రధానమంత్రి సమ్మాన్​ నిధి అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుల డేటాను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు.

ఎన్నికల ప్రణాళికలో టీఆర్​ఎస్ హామీ ఇచ్చిన ‘కేజీ టు పీజీ విద్య’ ఎక్కడ వరకు వచ్చిందని రాజాసింగ్​ ప్రశ్నించారు. తన నియోజకవర్గం గోషామహల్​ అభివృద్ధి కోసం ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా చెత్తబుట్టలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్​ సీఎంగా ఉంది గజ్వేల్​కు మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్రానికి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. వార్షిక బడ్జెట్ లో రూ. 30 వేల కోట్ల లోటును ఎట్ల పూడ్చుకుంటారని నిలదీశారు. రాష్ట్రం చేస్తున్న అప్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు.