కరొనపై చైనా, అమెరికాల మాటల యుద్ధం 

ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రాణకంటకంగా విజృంభిస్తున్న కోవిడ్-19కి మీరంటే మీరే కారణం అంటూ చైనా, అమెరికా దేశాలు పరస్పరం నిందించుకొంటున్నాయి. ఈ విషయమై ఇరు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. 

చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడినపుడు ఆ దేశం సరైన జాగ్రత్తలు తీసుకోనందు వల్లే సమస్య ఇంత జటిలంగా మారిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రెయిన్‌ మండిపడగా... కరోనాను ‘వుహాన్‌ వైరస్‌’గా ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అభివర్ణించారు. 

దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ అమెరికా నేతల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అమెరికా సైన్యాధికారులే ఈ ప్రాణాంతక వైరస్‌ను చైనాలోకి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఈ మేరకు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ బోర్డు డైరెక్టర్(సీడీసీ)‌, వైరాలజిస్ట్‌ రాబర్ట్‌ ఆర్‌.రెడ్‌ఫీల్డ్‌ హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో చేసిన ప్రసంగ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు 

‘‘ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) కారణంగా సంభవించిన కొన్ని మరణాలకు కోవిడ్‌-19 కారణమని అమెరికా సీడీసీ డైరెక్టర్‌ చెప్పారు. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా 34 మిలియన్ల మంది బాధపడుతున్నారని.. అదే విధంగా 20 వేల మంది మరణించారని పేర్కొన్నారు. అందులో కోవిడ్‌1-9 వల్ల సంభవించిన మరణాలు ఎన్ని? దయచేసి మాకు ఆ విషయం చెప్పండి" అంటూ నిలదీశారు. 

"ఇంకో విషయం సీడీసీ చూడండి అక్కడే ఎలా దగ్గుతున్నారో.. అసలు అమెరికాలో ఎంతమంది వైరస్‌ బారిన పేషెంట్లు ఉన్నారు? వారికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల పేర్లేంటి? బహుశా అమెరికా సైన్యమే ఈ ప్రాణాంతక వైరస్‌ను వుహాన్‌కు తీసుకువచ్చి ఉంటారు. పారదర్శకంగా వ్యవహరించండి! గణాంకాలను ప్రజలకు తెలియజేయండి! అమెరికా వివరణ ఇవ్వాల్సిందే’’ అని లిజియాన్‌ డిమాండ్‌ చేశారు.

ఆయన వ్యాఖ్యలను రాబర్ట్‌ ఒబ్రెయిన్‌ మరోసారి తిప్పికొట్టారు. కరోనా అమెరికాలో పుట్టలేదని.. కచ్చితంగా వుహాన్‌లోనే ఉద్భవించిందని చెప్పుకొచ్చారు. కాగా మొదటి కరోనా కేసును వుహాన్‌లో కనుగొన్నామని చైనా సీడీసీ గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దాదాపు 115 దేశాల్లో రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా, గురువారం నాటికి 4వేలకు పైగా మంది మృత్యువాత పడ్డారు.