73కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు  

భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 73 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ 73 మందిలో 56 మంది దేశీయులు కాగా, 17 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది. 

కాగా, కరోనా వైరస్ పట్ల ప్రజలు భయ  భ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఏ కేంద్ర మంత్రి కూడా కొన్ని రోజుల పాటూ విదేశీ పర్యటనలు చేయకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.

 దేశ ప్రజలు కూడా అనవసరమైన విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రధాని కోరారు. కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని, అంతేకాకుండా కరోనాను అడ్డుకోడానికి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను పంపించి, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 

వీటితో పాటు వీసాలపై నిషేధం విధించడం నుంచి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపడం వరకూ అనేక చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

ఇలా ఉండగా, దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఇప్పటి వరకు 10,57, 506 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలో 6, హర్యానాలో 14(అందరూ విదేశీయులే), కేరళలో 17, రాజస్థాన్‌లో 3(ఇద్దరు విదేశీయులు), తెలంగాణలో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో 10(ఒకరు విదేశీయులు), లఢఖ్‌లో 3, తమిళనాడులో ఒకరు, జమ్మూకశ్మీర్‌లో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.