కరోనా ముప్పుతో సాధారణ వీసాలన్నీ రద్దు 

దేశంలో కరోనా (కొవిడ్‌-19) కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సుమారు నెలపాటు సాధారణ వీసాలన్నింటిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దౌత్య, అధికార, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగుల, ప్రాజెక్టు వీసాలు తప్ప సాధారణ వీసాలన్నింటిని ఏప్రిల్‌ 15 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రవాస భారతీయులకు (ఓసీఐ కార్డుదారులకు) కల్పించిన వీసా రహిత పర్యాటక సౌకర్యాన్ని ఏప్రిల్‌ 15 వరకు నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ నుంచి వచ్చిన లేదా ఆయా దేశాలను సందర్శించిన విదేశీ పర్యాటకులు, భారతీయులను 14 రోజులపాటు వేరుగా (క్వారంటైన్‌లో) ఉంచనున్నట్లు తెలిపారు. 

అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలు, సిబ్బంది, ప్రయాణి కుల ప్రవేశంపై మార్చి 31 వరకు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ పేర్కొ న్నది. అలాగే అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలను థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాట్లున్న పోర్టుల్లోకి మాత్రమే అనుమతిస్తామని, సిబ్బంది, ప్రయాణికులు తమ వివరాలను స్వీయ పత్రంలో పేర్కొని పోర్టు ఆరోగ్య అధికారికి సమర్పించాలని, ఎవరికైనా కరోనా సోకినట్లు తేలితే నౌక నుంచి దిగేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. 

దేశంలో కరోనా నిర్ధారణ కేసుల సంఖ్య 60కి చేరింది. ఇందులో 16 మంది ఇటలీ దేశస్థులున్నట్లు కేంద్రం పేర్కొంది. ఢిల్లీ, రాజస్థాన్‌లో బుధవారం కొత్తగా ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు తెలిపింది. కేరళ, ఉత్తర ప్రదేశ్‌లో 9 చొప్పున, ఢిల్లీలో 5, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌, లడఖ్‌లో రెండేసి, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడులో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని, కేరళలో ముగ్గురు కోలుకున్నారని వెల్లడించింది. 

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు బ్రిటీష్‌ కాలం నాటి అంటువ్యాధి చట్టం 1897ను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రకారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసే నిబంధనలను అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి శిక్ష విధిస్తారు. 18వశతాబ్దంలో ప్లేగు వ్యాధిని నియంత్రించేందుకు  బ్రిటీష్‌ పాలకులు ఈ చట్టాన్ని రూపొందించారు. విపత్తు నిర్వహణ చట్టం 2005ను కూడా అమలుచేయనున్నారు.

కరోనా భయంతో మహారాష్ట్రకు చెందిన కోళ్ల పరిశ్రమ రైతు సురేశ్‌ భట్లేకర్‌ రూ.5.8 కోట్ల విలువైన కోళ్ల ఉత్పత్తులు ధ్వంసం చేశాడు. ఆయనకు మహారాష్ట్ర, గుజరాత్‌లో 35 కోళ్ల ఫారాలు, మూడు కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కరోనా నేపథ్యంలో చికెన్‌, గుడ్లపై జరుగుతున్న అసత్య ప్రచారంతో అమ్మకాలు తగ్గాయి.  దీంతో నష్టాలు తగ్గించుకునేందుకు 1.75 లక్షల కోడిపిల్లలు, 9 లక్షల గుడ్లను గుంతతీసి పూడ్చినట్లు పేర్కొన్నాడు.