ఈ ఏడాది ఐపీఎల్ జరిగేనా! 

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నప్పటికీ ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కేసులు పెరుగుతుండడంతో సామాన్యులే గుంపుగా జనం ఉన్న చోటుకు వెళ్లడానికి భయపడుతున్నారు. అటువంటప్పుడు ఐపీఎల్-13 ఆటలకు క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో రావడం పట్ల ప్రభుత్వ వర్గాలలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. 

మార్చి 29న ( షెడ్యూల్ ప్రకారం) ఐపీఎల్-13 ప్రారంభం కాబోతోంది. ముంబైలో తొలి మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. అయితే వైరస్ వ్యాప్తి భయంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకంపై నిషేధం విధించినట్లు తెలుస్తున్నది. భారీగా జనంతో కూడిన ఎలాంటి ఈవెంట్స్‌కు అనుమతి ఇవ్వకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

గురువారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో  ఐపీఎల్ మ్యాచ్‌ల రద్దు లేదా వాయిదాపై  మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే చెప్పారు. అదే జరిగితే మిగిలిన రాష్ట్ర ప్రభుతాలు సహితం అటువంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 

కర్ణాటక ప్రభుత్వం కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ఆంక్షలు పెట్టేందుకు యోచిస్తోంది. గతవారంలోనే దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ సలహా కోరింది.   కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా బెంగళూరులో జరగబోయే మ్యాచ్‌లను నిలిపేసే విషయమై కేంద్రానికి లేఖ రాసింది. 

మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముంబైలో మ్యాచ్‌లను నిలిపేయాలని నిర్ణయం తీసుకుందని, తాము కూడా బెంగళూరులో మ్యాచ్‌లను ఆపేసేందుకు కేంద్రం సలహా కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్లు కర్ణాటక మంత్రి కె.సుధాకర్ తెలిపారు. 

కరోనా వ్యాప్తి నియంత్రణకు ఐపీఎల్ మ్యాచ్‌లను నిలిపేసేందుకు మహారాష్ట్ర తీసుకునే తుది నిర్ణయాన్ని తాము కూడా పరిగణనలోకి తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం చెబుతున్నది. 

మరోవైపు ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ అనుమతి నిరాకరించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో జి అలెక్స్‌ బెంజిగర్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.