కేటిఆర్ నోటిని అదుపులో పెట్టుకో : కిషన్ రెడ్డి

నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడ వద్దని, నోటిని అదుపులోకి పెట్టుకోవాలని కేటీఆర్‌ను బిజెపి నేత జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. సీఆర్‌ సర్కార్‌ అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి స్మృతిఇరానీ తెలంగాణాకు ఇస్తున్న నిధులు వారి ఇంటి నుంచి ఇవ్వడం లేదని, ప్రజలు చెల్లించిన పన్నులేనంటూ కేటీఆర్‌ చేసిన వాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు

కరీంనగర్‌లో ఈనెల 10న అమిత్‌షా రెండో బహిరంగ సభను ఏర్పాటుచేస్తున్నామని, ఈ సభకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తామని తెలిపారు.  త్వరలోనే అధిష్ఠానం అనుమతితో అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతిలో త్వరలో బీజేపీలో చేరికలు ఉంటాయని కిషన్‌రెడ్డి ప్రకటించారు.

ఐదు సంవత్సరాల అధికారాన్ని టీఆర్‌ఎ్‌సకు కట్టబడితే నాలుగున్నరేళ్లకే కేసీఆర్‌ రాజీనామాతో పరుగెత్తుకెళ్ళారని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చి న హామీలు అమలుకాక, అనేక సమస్యలను పట్టించుకోక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ద్వజమెత్తారు.

2014లో జరిగిన ఎన్నికల్లో 21 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిస్తే 11 మంది మాత్రమే ఉన్నారని, 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్కరే మిగిలారని, ఒకే ఒక్క సీపీఐ ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కూడా టీఆర్‌ఎ్‌సలో చేరారని కిషన్ రెడ్డి గుర్తు చేసారు. తమ ఎమ్మెల్యేలనే రక్షించుకోలేని పార్టీలు మహాకూటమితో ప్రజలను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. 1500 మంది ఆత్మబలిదానాలకు కాంగ్రె‌స్ పార్టీ కారణమైందని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 స్థానాలకు బీజేపీ ఒంటిరిగానే పోటీచేస్తుందని, తప్పకుండా అధికారంలోకి వస్తామని కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో జరిగే అమిత్‌షా సభ విజయవంతం చేయాలని, బీజేపీని ఆదరించి, మోదీ నాయకత్వాన్నిరాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.