సింధియా బాటలో పలువురు కాంగ్రెస్ నేతలు!

కాంగ్రెస్ నుండి నిష్క్రమించి బీజేపీలో చేరుతున్న జ్యోతిరాదిత్య సింధియా తరహాలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా యువ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌ నుండి బీజేపీఐలో చేరడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా రాజస్థాన్, మహారాష్ట్రాలలోని ప్రభుత్వాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పలు రాష్ట్రాలలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. గాంధీ కుటుంభానికి సుమారు రెండు దశాబ్దాలుగా సన్నిహితంగా ఉన్న సింథియానే పార్టీలో అవమానాలను తట్టుకోలేక పార్టీని విడిచి పెట్టవలసి రావడం కాంగ్రెస్ పార్టీ యువనేతలలో కలకలం రేపుతున్నది. సింథియా బహిరంగంగానే కొద్దీ రోజులుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా గాంధీ కుటుంభం సభ్యులు ఎవ్వరు సర్దిచెప్పే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 

ప్రస్తుతం సింధియాకు సన్నిహితుడైన  రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హర్యానా యువ నాయకుడు దీపేందర్ సింగ్ హుడ్డా, మహారాష్ట్ర యువ నాయకుడు మిలింద్ దేవరా తదితర నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేయవచ్చుననే మాట వినిపిస్తోంది. వీరంతా కుడా రాహుల్ గాంధీ కి సన్నిహితులు కావడం గమనార్హం. ఈ పరిణామాలు కాంగ్రెస్ లో కలవరాన్ని కలిగిస్తున్నాయి.   

గత కొన్ని ఏండ్లుగా వరుసగా అనేకమంది ప్రముఖులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నా ప్రేక్షక పాత్ర వహించడం తప్ప అధినాయకత్వం ఏమీ చేయలేక పోతున్నది. గతంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ఇదే విధంగా పార్టీని విడిచి పెట్టి వెళ్లడంతో ఆ మూడు రాష్ట్రాలలో పార్టీ చావుదెబ్బ తినడం తెలిసిందే. వారు విజయ్ బహుగుణ (ఉత్తరాఖండ్), అజిత్ జాతి (ఛత్తీస్ ఘర్), గిరిధర్ గొమాంగో (ఒడిస్సా). 

మాజీ కేంద్ర మంతృలు జీడీ వాసన్, జయంతి నటరాజన్ (తమిళనాడు), కిషోర్ చంద్ర దేవ్  (ఆంధ్ర ప్రదేశ్), బేని ప్రసాద్ వర్మ (యుపి), శ్రీకాంత్ జేనా (ఒడిశా), శంకర్ సింగ్ వాఘేలా (గుజరాత్); మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ తన్వార్ (హర్యానా), రీటా బహుగుణ (యుపి), బొత్సా సత్యనారాయణ (ఆంధ్ర ప్రదేశ్), భుబనేశ్వర్ కలిత (అస్సాం), యాశ్పాల్ ఆర్య (ఉత్తరాఖండ్), అశోక్ చౌదరి (బీహార్) గత కొద్దీ సంవత్సరాలుగా కాంగ్రెస్ ను వీడుతూ వచ్చారు. 

కాంగ్రెస్ ను వీడిన ఇతర ప్రముఖులలో హిమంతా బిస్వా శర్మ (అస్సాం), ప్రేమ్ ఖండూ (అరుణాచల్ ప్రదేశ్), సుదీప్ రాయ్ బర్మన్ (త్రిపుర), ఎన్ బీరెన్ సింగ్ (మణిపూర్) ఉన్నారు. 

ఇదిలాఉండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా సింధియా రాజీనామాపై స్పందించక పోవడం గమనార్హం. సుమారు రెండు దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న తనను పార్టీలో అవమానాలు జరుగుతూ ఉండడంతో అసంతృప్తిగా ఉన్నా సోనియా, రాహుల్ పట్టించుకొనక పోవడం పట్ల సింధియా ఆగ్రహంతోనే పార్టీని విడిచారని ప్రచారం జరుగుతున్నది.