12న బీజేపీలోకి  సింధియా 

మధ్య ప్రదేశ్‌లో రాజకీయాలు మలుపులు తిప్పి చివరకు కాంగ్రెస్‌ నుండి నిష్క్రమించిన మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల 12న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాదు ఆ మర్నాడే బీజేపీ తరఫున రాజ్యసభకూ నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. 

మంగళవారం హస్తినలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సింధియా సమావేశమైన కొద్ది సేపటికే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

రాజ్యసభకు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ఉదయం కాంగ్రెస్‌కు రాజీనామా చేయగానే సాయంత్రం బీజేపీలో చేరనున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయనను వెంటనే పార్టీలోకి తీసుకోకుండా 12న పార్టీలో చేర్చుకుని 13న రాజ్యసభకు నామినేషన్ వేయించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

సింధియా 12న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో బీజేపీ తీర్థం తీసుకోనున్నారు. సింధియా వర్గంతో పాటు బీజేపీ మధ్యప్రదేశ్ శాఖ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ బహిరంగ సభకు హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితర మంత్రులు హాజరు కానున్నారు. సింధియా రాజ్యసభ సభ్యుడైన అనంతరం కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా మంత్రిగా చేర్చుకోనున్నారు. 

ఇదిలాఉండగా సింధియా బీజేపీలో చేరడం స్వగృహానికి రావడమేనని మేనత్త, బిజెపి ఎంపీ యశోధర రాజే సింధియా ఇంకా పలువురు బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ రావు సింధియా దాదాపు పది సంవత్సరాల పాటు జనసంఘ్‌లో పని చేశారు, నాయనమ్మ విజయరాజె సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చాలా కాలం క్రితం చేరారు. ఈ లెక్కన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరడం స్వగృహానికి రావడం లాంటిదేనని యశోధర రాజే సింధియా చెప్పారు.