కరొనతో రూ.148 లక్షల కోట్ల మేర నష్టం   

అగ్రదేశాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వార్షిక జీడీపీ అంచనాలు 2.5 శాతం దిగువకు పడిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది రూ.148 లక్షల కోట్ల (2 ట్రిలియన్‌ డాలర్లు) వరకు నష్టం వాటిల్లవచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) నిపుణుల అంచనా. 

‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2 శాతం మందగమనాన్ని మనం చూస్తామనిపిస్తున్నది’ అని ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి విభాగంలో ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల శాఖ డైరెక్టర్‌ రిచర్డ్‌ కోజుల్‌-రైట్‌ పేర్కొన్నారు. ఇప్పటిదాకా కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 4వేల మందికిపైగా చనిపోగా, ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య 3వేలు దాటింది. ఇక 100కుపైగా దేశాల్లో సుమారు 1.15 లక్షల మంది బాధపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ ప్రాణాంతక వైరస్‌.. మనుషుల ప్రాణాల్నేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ మింగేస్తున్నదని యూఎన్‌ ఏజెన్సీ వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే కనిష్ఠంగా 1 ట్రిలియన్‌ డాలర్లు.. గరిష్ఠంగా 2 ట్రిలియన్‌ డాలర్ల మేర ప్రపంచ ఆదాయం క్షీణించవచ్చని తెలిపింది. 

ఈ అంటువ్యాధిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు వ్యాపార, పారిశ్రామిక రంగాలకు విఘాతం కలిగిస్తున్నాయి. వైరస్‌ భయాలతో కార్మికులు ఇండ్లకే పరిమితమవుతుండటంతో కర్మాగారాలు మూతబడి ఉత్పత్తి నిలిచిపోతున్నది. రోడ్ల మీదకూ వచ్చేందుకు జనాలు బెంబేలెత్తిపోతుండటంతో వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర స్థాయిలో నష్టపోగా, ఇటలీ, దక్షిణ కొరియా తదితర దేశాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఈ క్రమంలోనే చైనాయేతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయం 220 బిలియన్‌ డాలర్లు పడిపోవచ్చంటున్న యూఎన్‌ ఏజెన్సీ.. భారత్‌కు 348 మిలియన్‌ డాలర్ల (రూ.2,569 కోట్లు) నష్టం రావచ్చని అంచనా వేస్తున్నది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కరోనా కుదిపేస్తుండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి సూచికేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కెనడా, మెక్సికో, సెంట్రల్‌ అమెరికన్‌ రీజియన్‌, తూర్పు, దక్షిణాసియా దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు కరోనాతో ప్రభావితం అవుతున్నట్లు చెప్తున్నారు. ఈ దేశాల్లో 0.7 నుంచి 0.9 శాతం మేర వృద్ధిరేటు పడిపోయే వీలుందన్నారు.  

ప్రపంచ ముడి చమురు వినియోగదారుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాలో చమురు వినియోగం గణనీయంగా తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోయి క్రూడ్‌ ధరలు విపరీతంగా దిగజారాయి. ఏ ఉత్పత్తి తయారుచేసినా ప్రపంచం మీదికి వదిలే చైనా.. తమ దేశంలో పుట్టిన కరోనా వైరస్‌నూ ఇతర దేశాలకు అంటించింది. దీంతో ఇప్పుడు అన్ని దేశాలూ లబోదిబోమంటున్నాయి.

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్‌ అప్రమత్తమైంది. సిలికాన్‌ వ్యాలి, శాన్‌ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌ల్లోని తమ కార్యాలయాలకు వచ్చే సందర్శకులను కట్టడి చేస్తున్నది. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని ఇచ్చిన గూగుల్‌.. ఉద్యోగార్థులకూ ఇంటర్వ్యూలను ఆపేస్తున్నది. తమ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి సమావేశాలనూ రద్దు చేసుకుంటున్నది.

యాపిల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలూ తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని యాపిల్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగా, ట్విట్టర్‌ సోమవారం నుంచే ఉద్యోగులకు ఇంటి పని సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.