కరోనా గుప్పిట ఇటలీ ఉక్కిరిబిక్కిరి

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనావైరస్‌ ప్రపంచంలోని ఇతర దేశాలను, ప్రధానంగా ఇటలీని చుట్టుముట్టడంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించటంలో భాగంగా దేశ ప్రజలు ఒక్క చోట గుమి గూడటంపై నిషేధం విధించింది. దీనితో పాటు దేశవ్యాప్తంగా పర్యటనలపై కూడా ప్రభుత్వం నిషేధం విధించింది.

దేశవ్యాప్తంగా వివాహాల వంటి కార్యక్రమాలను దాదాపు మూడు వారాల పాటు నిషేధించారు. ఇన్ఫెక్షన్‌ అనుమానితులను మూడు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణ (క్వారంటైన్‌)లో వుంచాలని నిర్ణయించారు. బార్‌లు, రెస్టారెంట్‌లు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని, ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జారీ చేసిన డిక్రీలో ఈ చర్యలు ఏప్రిల్‌ 3 వరకూ అమలులో వుంటాయని ప్రభుత్వం వివరించింది. 

గత ఏడాది చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ ప్రభావానికి ఐరోపాలో అత్యధికంగా గురయింది ఇటలీయే. అక్కడ ఇప్పటి వరకూ దాదాపు 9 వేల మందికి పైగా ఈ కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకగా, 400కు పైగా మరణాలు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాలలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు అన్ని స్థాయిల్లో జరగాల్సిన క్రీడా కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. 

కొత్త నిబంధనల ప్రకారం దేశంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పర్యటించటానికి అత్యవసర పనులు లేదా ఆరోగ్య కారణాలతో మాత్రమే అనుమతిస్తారు. అయితే ప్రజలు ఎక్కడి నుంచయినా తమ స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు ఎటువంటి ఆంక్షలు వుండవు. 

ఇప్పటి వరకూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన క్వారంటైన్‌ జోన్‌ను ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తరించటంతో ఉత్తరాదిన వున్న మిలన్‌, వెనిస్‌ తదితర నగరాల పరిసరాలలో వున్న పారిశ్రామిక ప్రాంతం అంతా ఈ ఆంక్షల పరిధిలోకి వచ్చింది. స్కూళ్లు, యూనివర్శిటీలను వెంటనే మూసివేయాలని, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు వెంటనే సెలవు మంజూరు చేసి వారిని ఇళ్లకు పంపివేయాలని ప్రభుత్వం సూచించింది.