కేరళలో పాఠశాలలు, సినిమాలు  బంద్ 

దేశంలోని మొదటిసారిగా కరోనాకు ముగ్గురి గురయిన కేరళ రాష్ట్రం ఇప్పుడు ఈ వైరస్ తో కలవరం చెందుతున్నది. తమ రాష్ట్రంలో మరో ఆరుగురికి కరోనా వైరస్‌ సోకిందని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో కేరళలో కరోనా సోకిన వారి సంఖ్య 12కు పెరిగిందని చెప్పారు. 

దానితో, ఈ నెల 31వ తేదీ వరకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తరగతులు, పరీక్షలను నిర్వహించకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని చెప్పారు. అన్ని ట్యూషన్‌ క్లాసులు, అంగన్వాడీలు, మదర్సాలను ఈ నెల 31వరకు మూసేస్తున్నట్లు ప్రకటించారు.

బెంగళూరులో సహితం ఐదవ తరగతుల వరకు పాఠశాలలకు నిరవధికంగా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా.. రేపటి నుండి మార్చి 31 వరకు కేరళలో సినిమా థియేటర్లు మూసివేయబడతాయని మళయాళం సిినిమా ఆర్గనైజేషన్ తెలిపింది. కరోనా ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

మరోవంక,  దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నప్పటికీ ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ హోమ్‌గ్రౌండ్‌ అయిన బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. లీగ్‌ను వాయిదా వేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా మంగళవారం దేశంలో కొత్తగా 9 కరోనా కేసులు బైట పడడంతో దేశం మొత్తం మీద కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 56 కి చేరింది. పూణేకు చెందిన ఒక జంట వైరస్ టెస్ట్ లు చేయగా వారిద్దరికి ..పాజిటివ్ కేసు నమోదైంది. మహారాష్ట్రలో నమోదైన మొదటి కేసులివి. వీరిద్దరూ అంతకుముందు దుబాయ్ లో ఉండి ఇండియాకు వచ్చినట్టు తెలిసింది. వారు ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో ఉన్నారు.