కాంగ్రెస్ కు సింధియా రాజీనామా... బిజెపిలోకి!

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దానితో ఆయన బీజేపీలో చేరడంతో పాటు, కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. మరోవంక మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తధ్యంగా కనిపిస్తున్నది. 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన రాజీనామా లేఖలో 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని ఆ లేఖలో సింధియా పేర్కొన్నారు. రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాయని ఆయన తెలిపారు. 

 ప్రజల ఆకాంక్షలు,  కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు  సింధియాకు మద్దతుదారులైన ఐదుగురు మంత్రులతో పాటు 18 మంది ఎమ్యెల్యేలు ఇప్పటికే కర్ణాటకలో ఉన్నారు. వారిని కలవడంకోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

సింధియాను కాంగ్రెస్ నుండి వెళ్లిపోకుండా చేయడం కోసం చివరిసారిగా రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను కాంగ్రెస్ ప్రయోగించింది. ఆయన కలిసినా ప్రయోజనం లేకపోయింది. సింధియాకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి కూడా సిద్ధమని ముఖ్యమంత్రి కమల్‌నాథ్  గత రాత్రి ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది.

230 మంది సభ్యులున్న మధ్య ప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్ కు 114 మంది సభ్యులతో పాటు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ ఎమ్యెల్యేల మద్దతు ఉంది. అయితే సింధియా మద్దతుదారులైన 17 నుండి 20 మంది వరకు ఎమ్యెల్యేలు మద్దతు ఉపసంహరించుకొంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. బిజెపికి 109 మంది సభ్యులు ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ సాయంత్రం గవర్నర్ ను కలసి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశింపమని కోరే అవకాశం ఉంది. మరోవంక, ఈ సాయంత్రం సమావేశమవుతున్న బిజెపి పార్లమెంటరీ పార్టీ సింధియాను మధ్యప్రదేశ్ నుండి తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.