కరోనా గుప్పిట్లో 100కు పైగా దేశాలు

దాదాపు 100కు పైగా ప్రపంచ దేశాలు చైనాలో వెలుగు చూసి ఆ దేశాన్ని వణికించిన కరోనా వైరస్‌ గుప్పిట చిక్కుకుని విలవిల లాడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మాల్దీవులు, బల్గేరియా, కోస్టారికా, ఫరోదీవులు, ఫ్రెంచ్‌ గుయానా, మాల్టా, మార్టినిక్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ మాల్డోవా వంటి ఎనిమిది దేశాలను కరోనా వైరస్‌ చుట్టుముట్టిందని డబ్ల్యుహెచ్‌ఓ సోమవారం నాడు ఒక ట్వీట్‌లో వెల్లడించింది. 

చైనాలో కరోనా బాధితుల మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి వరకు 3,800 మందికిపైగా మరణించారని ఏజెన్సీ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ) అనే వార్తా సంస్థ వెల్లడించింది.  

భారత్‌లో ఇప్పటి వరకూ 45 కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు వెలుగు చూడగా ప్రభుత్వం ఈ వైరస్‌ వ్యాప్తి నివార‌ణ‌కు అనేక చర్యలు చేపట్టింది. భారత్‌ నౌకాశ్రయాల్లోకి ఇతర దేశాల నౌకలను అనుమతించకపోవటంతోపాటు ఇటలీ, ఇరాన్‌, ద.కొరియా, జపాన్‌ దేశాల పర్యాటకులకు వీసా, ఇ-వీసా సౌకర్యాలను సస్పెండ్‌ చేసింది. 

కాగా, భారత్ లో మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, కర్ణాటకలో ఒక్కొక్కరికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వీరిలో మూడేండ్ల చిన్నారి కూడా ఉన్నది.  వైరస్‌ నేపథ్యంలో బెంగళూరు లోని అన్ని ప్రాథమిక పాఠశాలను నిరవధికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు.   

కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ ప్రభావంతో ఇరాన్‌లో సోమవారం నాడు 49 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మొత్తం కరోనా మృతుల సంఖ్య 237కు చేరింది. ఇప్పటి వరకూ దేశంలో 7,167 మందికి కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధారణ కాగా, అందులో 2,394 మంది ఈ ప్రభావం నుండి కోలుకున్నారని ఇరాన్‌ ఆరోగ్య మంత్రి సలహాదారు అలీరెజా వాహబ్జాదా ఒక ట్వీట్‌లో వెల్లడించారు. 

ఇరాన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ప్రస్తుతం వివిధ జైళ్లలో వున్న దాదాపు 70 వేల మందికిపైగా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఇరాన్‌ జుడీషియరీ ఛీఫ్‌ ఇబ్రహీమ్‌ రైసీ ప్రకటించారు.