ప్రభుత్వం కూల్చాలనే ఆసక్తి లేదు

మధ్యప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందిస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని ఆసక్తి తమకు లేదని స్పష్టం చేశారు. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. 

రాజకీయ సంక్షోభం తలెత్తితే దానికి తాము చేసేదేమీ లేదని, అది పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను వ్యాఖ్యానించలేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వం కూల్చే ఉద్దేశం తమకు లేదని తాను మొదటి రోజే చెప్పానని మీడియాతో మాట్లాడుతూ గుర్తు చేశారు. 

సోమవారం అర్ధరాత్రి సుమారు 20 మంది కేబినెట్ మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సమర్పించారు. వాటిని కమల్‌నాథ్ ఆమోదించారని, మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభ నివారణకు ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపాలనే ప్రతిపాదన కూడా ఉంది.