తిరుపతిలో మరో మెడికో ఆత్మహత్య

తిరుపతిలో ఎస్వీ మెడికల్ కాలేజీలో వారం రోజుల క్రితం మెడికో శిల్ప ఆత్మహత్య చేసుకున్న విషాదం నుండి తెరుకోనక ముందే అదే చోట మరో ఘోరం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక అనే విద్యార్థిని ఆదివారం సాయంత్రం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థినిది కడప జిల్లా అని తెలిసింది.

ఆదివారం సాయంత్రం ఆమె స్నేహితులు బయటికెళ్లి హాస్టల్‌కు వచ్చిన వాళ్లు తలుపు కొట్టినప్పటికీ గీతిక నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కంగారుపడ్డ తోటి విద్యార్థునులు వార్డన్‌కు సమాచారం అందివ్వగా వచ్చి తాళం పగలకొట్టిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన గీతికను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో యూనివర్శిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

కాగా వారం తిరగక మునుపే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో అసలు క్యాంపస్‌లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరి ఆత్మహత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అయితే గీతిక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమేంటి? లైంగిక వేధింపులే కారణమా..? లేకుంటే తోటి విద్యార్థుల వేధింపులా..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. విద్యార్థిని హాస్టల్ గదిలో ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదు.

శిల్ప ఆత్మహత్యతో గత కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆత్మహత్య అనంతరం పరిణామాలు మారతాయని భావించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరో విద్యార్థిని మరణించినట్లు తెలుసుకున్న ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ హుటాహుటిన క్యాంపస్‌కు చేరుకుని అసలేం జరిగిందా? అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.