పతనంలో కమల్‌నాథ్ ప్రభుత్వం-- 18 మంది ఎమ్యెల్యేల జంప్   

మధ్య ప్రదేశ్ లోని కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లయింది.  సోమవారం మధ్యాహ్నం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు బెంగళూరుకు చేరుకోవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరమైనది. 

భోపాల్ నుంచి మూడు ప్రత్యేక చార్డెట్ ఫ్లైట్‌లో వీరిని జాగ్రత్తగా తరలించినట్లు తెలుస్తున్నది. వీరందరూ కూడా రెబెల్‌ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు చెబుతున్నారు. ఈ రెబెల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని భోపాల్‌లో కాంగ్రెస్ వర్గాలలో అలజడి బైలు దేరింది. 

అయితే ఈ మొత్తం వ్యూహానికి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియానే కారణమని ముఖ్యమంత్రి వర్గం ఆగ్రహంతో యూటిపోతున్నది. ఇంత జరుగుతున్నా కూడా ఆయన రాజధాని ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈ 18 మందిలో అత్యధికులు ఈయన వర్గం వారే కావడం విశేషం. 

ఈ 18 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు మంత్రులు కూడా రెబెల్స్ గా మారడంతో ప్రతిపక్ష బీజేపీ సభలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెప్పుకొంటున్నారు. 

మరోవైపు ఈ సంక్షోభంపై దిక్కుతోచని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సీఎం కమల్‌నాథ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఏం చేయాలన్న దానిపై సోనియా తనకు మార్గదర్శనం చేశారని, దానిని అమలు చేస్తానని కమల్‌నాథ్ ప్రకటించారు.