వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీమంత్రి డొక్కా 

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి సీఎం జగన్‌ వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. 

అనంతరం  డొక్కా వరప్రసాద్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 

2014లోనే వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, కానీ కొన్ని కారణాల రిత్యా టీడీపీలో చేరవల్సి వచ్చిందని తెలిపారు. అయినా కూడా టీడీపీలో సరైన గౌరవం లభించలేదని, కాలం కలసిరాలేదని విచారం వ్యక్తం చేశారు.