ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపుతున్న వైసిపి 

శాసన మండలిని రద్దు చేసే పక్రియను చేపట్టిన ముఖ్యమంత్రి వై ఎస్దా జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రి పదవులు కోల్పనున్న ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా వైసిపి ప్రకటించింది. 

వీరితో పాటు రాంకే సంస్థల అధినేత ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని కూడా తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక నాలుగో సీటు పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానికి వైసీపీ కేటాయించింది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి   ఒక సీటు కేటాయించారు. 

ఏపీ నుండి నాలుగు సీట్లకు జరుగనున్న ఎన్నికలలో అన్ని సీట్లను వైసిపి ఏకగ్రీవంగా గెల్చుకొనే అవకాశం ఉంది. వైసీపీకి రాజ్యసభలో ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఉన్నారు. 

రిలయన్స్ గ్రూప్ కు చెందిన పరిమల్‌ నత్వాని ప్రస్తుతం ఝార్ఖండ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ పడిపోవడంతో తిరిగి గెలుపొందే అవకాశం లేకపోవడంతో ఆయనను ఏపీ నుండి ఎంపిక చేయాలని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ మధ్య స్వయంగా వచ్చి జగన్ ను కోరిన విషయం తెలిసిందే.