ప్రధాన హామీలు పట్టించుకోని తెలంగాణ బడ్జెట్

ఆర్ధిక మంత్రిగా టి హరీష్ రావు తొలిసారిగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో గొప్పగా కేటాయింపులు కనిపిస్తున్నా వాస్తవానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను పట్టించుకోలేదు. గత బడ్జెట్ లలో కేటాయింపులు చూపడమే గాని, ఆ మేరకు ఖర్చు పెట్టక పోవడంతో ప్రస్తుత కేటాయింపులు సహితం ఏమేరకు వాస్తవంలో ఖర్చు పెడతారో అనుమానాస్పదమే కాగలదు. 

ప్రతి  ఏటా అప్పులు పెరిగిపోతున్నాయని, 2014 -15 సంవత్సరంలో రూ 9,500  కోట్ల అప్పుల నుంచి  2017- 18 కి  రూ 49 వేల కోట్లకు అప్పు పెరిగిందని చెప్పారు. ఈ సారి కూడా దాదాపుగా రూ 35 వేల కోట్లు అప్పు చేసే అవకాశం ఉందని,  దీంతో వడ్డీల శాతం విపరీతంగా పెరిగిపోతుందని పేర్కొన్నారు. దానితో అప్పులు తేవడం, వడ్డీలు చెల్లిస్తూ ఉండటం పట్లనే ఆర్ధికంగా దృష్టి కేంద్రీకరించే పరిస్థితి ఏర్పడుతున్నది. 

ఆర్థిక మాంద్యం అనే సాకుతో అసెంబ్లీలో  అవాస్తవ బడ్జెట్ ని ప్రవేశ పెట్టారనే విమర్శలు ఎదురవుతున్నాయి.  గత బడ్జెట్ తో పోలిస్తే….ఈ సారి బడ్జెట్ లో ఆచరణలు కేటాయింపులు  తగ్గించారని చెప్పవచ్చు. 

2014 లో ఎన్నికల ముందు ఇచ్చిన మూడు ప్రధాన హామీలు బడ్జెట్ లో ప్రస్తావనకు రాలేదు.   దళితులకు మూడు ఎకరాల భూమి గురించి కానీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి కానీ, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో ఎక్కడ కూడా ప్రస్తావించనే లేదు. 

నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బడ్జెట్ ముందు రోజే చేతులెత్తేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యువతకు నిరుద్యోగ భృతిని ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తి లేదని  తేల్చి చెప్పారు. ఎన్నికలు జరిగి ఇప్పటికే 16 నెలలు అవుతూ ఉండగా, వచ్చే ఏడాది కూడా ఇవ్వలేమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశ పెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం నెలకొని ఉండటమే అందుకు కారణమని అంటూ ఒక సాకు చెప్పారు. వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరంలేదని సూచిస్తూ పథకాన్ని అమలు చేసేందుకు తమకు ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉందని తెలిపారు. 

మరోవంక నిరుద్యోగి ఎవరనేది గందరగోళంగా ఉన్నదని పేర్కొంటూ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పరిశీలించి అమలుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.    

కాగా,  ఇంటికో ఉద్యోగం ఇస్తామని తానెప్పుడూ అనలేదని అంతకు ముందు శాసన సభలో చెప్పారు. ఉద్యమసభల్లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదని, ఇతరప్రాంతాల వాళ్లు పోతే మనకు లక్ష ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పామని పేర్కొన్నారు. 

గత ఆరేళ్లలో  50 వేల ఉద్యోగాలు భర్తీచేశామని, ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. పోలీసు నియామకాలు కూడా కలిపితే 80 వేల మందికి ఉద్యోగాలు లభించినట్టని వివరించారు. 

బడ్జెట్ కేటాయింపుల్లో 33 శాఖలలో భారీగా కోతలు విధించారు, ఈ సారి వృద్ది రేటు పడిపోయింది కాబట్టి సంక్షేమ పథకాల్లో భారీగా కోత పడే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దానితో  కేటాయించిన నిధుల్లో కూడా భారీగా కోతలు తప్పకపోవచ్చు. 

గతంలో కేటాయించిన  ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్  నిధుల్లో 50 శాతం కూడా ఖర్చు చేయలేదు. గత బడ్జెట్ లో ఎంబిసి కి వెయ్యి కోట్ల కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక పోవడంతో, ఈ సారి కేటాయించిన 500 కోట్లను కూడా ఖర్చు చేస్తారనే నమ్మకం ఏమిటి ?