స్థానిక ఎన్నికలకు జనసేన, బీజేపీ సమాయత్తం  

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన సమన్వయంతో ముందుకు వెళ్తాయని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ , బీజేపీ నాయకురాలు దుగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలో ఇరు పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 

తొలుత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌ జీ కీలకోపన్యాసం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై కీలక చర్చ జరిగింది. సత్వరమే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు 12వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని ఇరుపార్టీల నేతలు ప్రకటించారు. 

నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ పొత్తును మరింత దృఢంగా, విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు.

ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లడంతో పాటు, భవిష్యత్తులో కేంద్రం సహకారంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశంపై ఇరుపక్షాల ఆలోచనలు పంచుకున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని పేర్కొన్నారు.

 ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని ప్రకటించారు. ప్రజల తరఫున పోరాటాలు చేయడంతో పాటు మోదీ నాయకత్వంలో రాష్ట్రానికి మేలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. 

కాగా, ప్రతిపక్షాలను దెబ్బతీసే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చూస్తోందని దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ప్రభుత్వ ఎత్తుగడను తిప్పికొట్టే విధంగా జనసేన, బీజేపీ సమన్వయంతో ముందుకు వెళ్తాయని ఆమె చెప్పారు. 

మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ సమన్వయ కమిటీలు వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సమావేశంలో జనసేన నుంచి కందుల దుర్గేష్‌, శ్రీనివాసయాదవ్‌, టి.శివశంకర్‌, గుంగులయ్య, సి.మధుసూదన్‌రెడ్డి, బీజేపీ నుంచి మాధవ్‌, సోము వీర్రాజు, కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి పాల్గొన్నారు.