కంట తడి పెట్టిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోడీ కంటతడి పెట్టారు. ఓ మహిళ మాట్లాడిన మాటలకు మోడీ బావోద్వేగంతో కంటతడి పెట్టారు. కొన్ని క్షణాల పాటు తన్మయానికి గురై మౌనం వహించారు.

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషాది పరియోజన కార్యక్రమంలో భాగంగా జన ఔషధి కేంద్రాల యజమానులు… ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. 

ఈ సందర్భంగా డెహ్రాడూన్ కు చెందిన దీపా షా మాట్లాడుతూ పథకం వల్లే ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆర్ధికంగా, మానసికంగా  ఇబ్బంది పడినట్లు తెలిపారు.

పక్షవాతానికి చికిత్స చేయించడం ఎంత కష్టమో ఆమె వివరించారు. ‘‘నాకు 2011లో పక్షవాతం వచ్చింది. నేను మాట్లాడలేకపోయేదాన్ని. నన్ను ఆసుపత్రిలో చేర్చారు. మందులు చాలా ఖరీదైనవి. నేను ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ద్వారా మందులు తీసుకుంటున్నాను. అంతకుముందు నా మందుల కోసం రూ.5,000 ఖర్చయ్యేది. ఇప్పుడు ఈ పథకం ద్వారా రూ.1,500 ఖర్చవుతోంది. దాదాపు మూడు వేలు మిగులుతోంది. ఆ సొమ్ముతో నేను పళ్ళు, ఇతర వస్తువులు కొనుక్కుంటున్నాను’’ అని తెలిపారు.   

‘‘మోదీ గారూ, నేను దేవుడిని చూడలేదు. కానీ నాకు మాత్రం మీరే దేవుడి అవతారం. నేను మీకు కృతజ్ఞురాలిని. ముఖ్యమంత్రి కూడా నాకు సహాయపడ్డారు. వైద్యులు ఆశలు వదిలేశారు, నేను బతకనని చెప్పారు. నేను బతకడం మాత్రమే కాకుండా జనరిక్ మందుల వల్ల ఖర్చులు కూడా తగ్గాయి. మోదీ గారూ, మీరు నాకు దేవుడివంటివారు. నేను మీకు చాలా చాలా కృతజ్ఞురాలిని’’ అని దీపా కళ్ళలో నీటి సుడులు తిరుగుతుండగా చెప్పారు. 

దీంతో మోదీ కూడా కన్నీటిపర్యంతమయ్యారు. కొన్ని క్షణాల పాటు మౌనం వహించారు. ఆయన గద్గద స్వరంతో ఆమె కష్టాన్ని ధైర్యంతో ఎదుర్కొన్న తీరును ప్రశంసించారు. 

అనంతరం కరోనా వైరస్ పట్ల ప్రధాని మోడీ ప్రజలకు పలు సూచనలిచ్చారు. వైరస్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దన్న మోడీ..షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ప్రతీ ఒక్కరు నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు

జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మార్చి 7న దేశ వ్యాప్తంగా జన ఔషధి దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 6,200 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటెయిల్ ఫార్మా చెయిన్‌గా గుర్తింపు పొందింది.