కాంగ్రెస్ ఎమ్యెల్యే రాజీనామాతో కమల్‌నాథ్ కు గండం!

కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం తమ ఎమ్యెల్యేలను బిజెపి రిసార్ట్ లకు తరలిస్తున్నట్లు ఆరోణనలు సంధిస్తున్న మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు తమ పార్టీకి చెందిన ఒక ఎమ్యెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో పెద్ద షాక్ తగిలిన్నట్లు అయింది.

పైగా, హర్యానాలోని ఒక రిసార్ట్ లో బిజెపి `దాచి ఉంచిన'  తమను కాంగ్రెస్ మంత్రులు వచ్చి విడిపించరనని అంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాలను ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ ఎమ్యెల్యేలు తీవ్రంగా ఖండించారు. 

మరో వంక ఇద్దరు మంత్రులతో సహా, కనీసం పది మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు `కనిపించక పోవడం'తో కాంగ్రెస్ నాయకులలో ఖంగారు వెలుగు చూస్తున్నది. వారిని కర్ణాటకలోని వివిధ రిసార్ట్ లలో బిజెపి నాయకులు దాచి ఉంచారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి మధుసూదన్ మాత్రం తీవ్రంగా  ఖండిస్తున్నారు.

‘‘పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరంలో చేరినట్లు, వారు బెంగళూరుకు చేరినట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారు నిజంగా బెంగళూరుకు వచ్చారా అన్నది మాత్రం నాకు తెలియదు. సమాచారం లేదు.’’ అని మధుసూదన్ తెలిపారు.

కాంగ్రెస్ ఎమ్యెల్యే హర్దీప్ సింగ్ డాంగ్ తన రాజీనామా లేఖను స్పీకర్ ఎన్ పి ప్రజాపతితో పాటు ముఖ్యమంత్రికి కూడా పంపారు. గత 14 నెలల కాంగ్రెస్ పాలనలో తన నియోజకవర్గంకు సంబంధించి ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగడం లేదని ఈ సందర్భంగా విమర్శించారు. బెంగళూరు  సమీపంలో ఉన్నారని చెబుతున్న కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో ఈయన కూడా ఒకరు కావడం గమనార్హం. 

తమను బిజెపి బంధిస్తే తామొచ్చి కాపాడి బైటకు తీసుకు వచ్చామని కాంగ్రెస్ వారు చేస్తున్న ప్రచారం పట్ల బీఎస్పీ ఎమ్యెల్యేలు ఇద్దరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పట్ల ఒక బిజెపి నాయకుడు రిసార్ట్ లో అసభ్యంగా ప్రవర్తించినట్లు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు చేయడం పట్ల బీఎస్పీ ఎమ్యెల్యే రామాభాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పట్ల ఆ విధంగా ప్రవర్తించే ధైర్యం ఎవ్వరికీ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. మరో ఎస్పీ ఎమ్యెల్యే షాయితం తమను బిజెపి వారెక్కడికో తీసుకు వెళ్లారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.