కరోనాపై భారతీయులు ఆందోళన చెందొద్దు

కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కలిగిన నలుగురైదుగురు తమకు తామే కోలుకోగలుగుతారని, వైరస్ వ్యాప్తిపై దేశ ప్రజలు భయాందోళనలు చెందనక్కర లేదని భారతీయ పరిశోధకురాలు, శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ భరోసా వ్యక్తం చేశారు. దగ్గు, జ్వరం తగ్గడానికి పారాసెటమాల్‌ వంటి మందుల్ని వాళ్లు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. 

ఈ పరిస్థితుల్లో అన్ని చికిత్సలు నయం చేయం చేసేవి కావని, కేవలం ఉపశమనం కలిగించేవే అని ఆమె తన అభిప్రాయం వెలిబుచ్చారు. భారత్‌లో కరోనా వైరస్ కేసులు 30 వరకు పెరిగాయి. వీరిలో ఇటాలియన్ టూరిస్టులు 16 మంది ఉన్నారు. కేరళకు చెందిన ముగ్గురు కోలుకున్నారు. ఐదుగురిలో నలుగురికి జ్వరం, దగ్గుకు సంబంధించి పారాసిటమల్ మాత్రలు తప్ప మరెలాంటి మందులు అక్కరలేదని ఐదో వ్యక్తికి మాత్రం ఆస్పత్రిలో చికిత్స అవసరమని ఆమె చెప్పారు. 

ఊపిరి తీయడం కష్టమైతేనే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు. నార్వే కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ కొలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నొవేషన్స్ (సిఇపిఐ) వైస్ చైర్‌పర్శన్‌గా ఆమె పనిచేస్తున్నారు. వైరస్ వ్యాక్సినేషన్లను వేగంగా అభివృద్ధి చేయడమే ఈ సంస్థ లక్షం. 

కరోనా వైరస్ కన్నా అనేక రకాల ఫ్లూ వైరస్‌లు భారత్‌లో ఉన్నాయని, అయితే ఫ్లూ కన్నా కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని గుర్తించాలని ఆమె పేర్కొన్నారు. ఇది పిల్లల కన్నా పెద్దలకే ఎక్కువగా సోకుతుందని, గుండె నాళాల సమస్యలు, డయాబెటిస్, రక్తపోటు ఉన్న వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పారు. 

ఈ వైరస్‌కు వ్యతిరేకంగా అనేక జౌషధాలను పరీక్షించడమవుతుందని, వచ్చే ఏడాదికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఇవన్నీ అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. జ్వరం దగ్గు వస్తే ఇంటి వద్దనే ఉండడం, జ్వరం దగ్గు ఉన్న వారికి ఆరు అడుగులు దూరంగా ఉండడం మంచిదని ఆమె సూచించారు.