భారత వాణిజ్యంపై కరోనా ప్రభావం రూ.2,556 కోట్లు  

భారత వాణిజ్యంపై కరోనా వైరస్‌ ప్రభావం దాదాపు రూ.2,556 కోట్లు (348 మిలియన్‌ డాలర్లు)గా ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) అంచనా వేసింది. టాప్‌-15 వైరస్‌ ప్రభావిత దేశ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఉందని తెలిపింది. 

చైనా ఉత్పాదక రంగం కుప్పకూలిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం కూడా దెబ్బతిన్నదని చెప్పింది. చైనాయేతర దేశాల్లో అత్యధికంగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు 15.6 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోతున్నాయని యూఎన్‌ వెల్లడించింది. 

ఆ తర్వాత అమెరికా (5.8 బిలియన్‌ డాలర్లు), జపాన్‌ (5.2 బిలియన్‌ డాలర్లు), దక్షిణ కొరియా (3.8 బిలియన్‌ డాలర్లు), తైవాన్‌ (2.6 బిలియన్‌ డాలర్లు), వియత్నాం (2.3 బిలియన్‌ డాలర్లు) దేశాలున్నాయి. ఇన్‌స్ట్రూమెంట్స్‌, మెషినరీ, ఆటోమోటివ్‌, క మ్యూనికేషన్‌ విడిభాగాల రంగాలు వైరస్‌ ప్రభావంతో చతికిలపడ్డట్లు యూఎన్‌ పేర్కొన్నది. 

భారత్‌లో రసాయన పరిశ్రమ 129 మిలియన్‌ డాలర్ల మేర ప్రభావితం కానుండగా, టెక్స్‌టైల్స్‌, దుస్తులు 64 మిలియన్‌ డాలర్లు, ఆటోమోటివ్‌ రంగం 34 మిలియన్‌ డాలర్లు, ఎలక్ట్రికల్‌ మెషినరీ 12 మిలియన్‌ డాలర్లు, తోలు ఉత్పత్తులు 13 మిలియన్‌ డాలర్లు, మెటల్స్‌, దాని ఆధారిత ఉత్పత్తులు 27 మిలియన్‌ డాలర్లు, కలప, ఫర్నీచర్‌ ఉత్పత్తులు 15 మిలియన్‌ డాలర్ల చొప్పున నష్టపోనున్నాయి.  

కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ విమానయాన రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అంటువ్యాధి ఒక దేశం నుంచి మరో దేశానికి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆయా దేశాల ప్రభుత్వాల ఆదేశాలతో ఎయిర్‌లైన్స్‌ సైతం తమతమ రూట్లను పెద్ద ఎత్తున తగ్గించేస్తున్నాయి. కొన్ని మార్గాలకైతే తాత్కాలికంగా సేవలను నిలిపివేస్తున్నాయి. 

దీంతో ఈ ఏడాది అంతర్జాతీయ విమానయాన పరిశ్రమకు రూ.8.29 లక్షల కోట్ల (113 బిలియన్‌ డాలర్లు) ఆదాయం వరకు పడిపోవచ్చని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) అంచనా వేసింది. రెండు వారాల క్రితం ఈ అంచనా కేవలం రూ.29.3 బిలియన్‌ డాలర్లుగానే ఉండటం గమనార్హం. కానీ ఇప్పుడది నాలుగింతలు పెరిగింది. వైరస్‌ నేపథ్యంలో 2 లక్షలకుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.