ప్రధాని మోదీ బెల్జియం పర్యటన రద్దు

ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం పర్యటన రద్దు అయింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఈ నెలలో జరగాల్సిన భారత - యూరోపియన్‌ యూనియన్‌ సదస్సు వాయిదా పడింది. కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఈ సదస్సును వాయిదా వేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బెల్జియం పర్యటన రద్దు అయినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందుతుండడంతో.. కొన్ని రోజుల పాటు పర్యటనలు వాయిదా వేసుకోవాలని రెండు దేశాల ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 

భారత - యూరోపియన్‌ యూనియన్‌ సదస్సును ఎప్పుడూ నిర్వహిస్తారు అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. మోదీ బెల్జియం పర్యటనకు సంబంధించి.. గత నెలలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌.. అక్కడ పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. 

భారత్ లో ఇప్పటి వరకు 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 16 మంది ఇటలీ దేశస్థులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మందికి పైగా కరోనా వైరస్‌ వ్యాధితో చనిపోయారు. 90 వేల మందికి పైగా కరోనా సోకింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హోలీ పండుగకు దూరంగా ఉండాలని మోదీ నిర్ణయించుకున్న విషయం విదితమే.