అద్దె ఇళ్లలో నివాసముండే వారికి బీజేపీ ‘బంపర్ బొనంజా’

అద్దె ఇళ్లలో నివాసముండే వారికి తెలంగాణా బీజేపీ ‘బంపర్ బొనంజా’ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. వారికి సొంత ఇళ్లు కట్టించి ఇచ్చే వరకూ అద్దెను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని విడుదల చేసిన ముసాయిదా `ప్రజా మేనిఫెస్టో’లో హామీ ఇచ్చింది. ఇది రూ. 5 వేల వరకూ వర్తిస్తుందని వెల్లడించింది. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించింది.

బీజేపీ ఎన్నికల మెనిఫెస్టో కమిటీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆధర్యంలో సమావేశమై ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఎలాంటి ఎలాంటి హామీలను మెనిఫెస్టోలో చేర్చాలన్న అంశంపై విస్తృతంగా చర్చ జరిపింది. ఇప్పటికే వివిధ వర్గాల నుంచి తీసుకున్న సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ, రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా సొంతింటి సమస్యే ప్రధానంగా మారిందన్న అంశాన్ని గుర్తించింది.

నీటిపన్ను భారం నుంచి ప్రజలకు ఊరట కల్గించేలా ప్రతి నెల రూ. 6 మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించింది. పేదలకు చదువు భారం కాకుండా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ నియమిస్తామని పేర్కొంది. ప్రతి విద్యా సంవత్సరానికి ముందే ఈ కమిటీ సమావేశమై ప్రజలకు భారం కాని స్థాయిలో ఫీజులను నిర్ణయిస్తుందని వెల్లడించింది.

డిగ్రీ, ఆపై ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తామని తెలిపింది. ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులకు కమర్షియల్ ట్యాక్స్ ఎత్తివేస్తామని ప్రకటించింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బోధించే టీచర్లు, లెక్చరర్లకు హెల్త్‌కార్డులు అందిస్తామని తెలిపింది.

అధికారంలోకి రాగానే ముందుగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని ప్రకటించింది. ఉద్యోగమిచ్చే వరకూ నిరుద్యోగ భృతిని అందిస్తామని పేర్కొంది. ఎస్సీల్లోని 59 ఉప కులాలకు కుల దృవీకరణ పత్రాలను సత్వరమే జారీ చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. అదే విధంగా డప్పు, చెప్పు కుట్టే కళాకారులకు రూ. 3వేలు పింఛన్ అందిస్తామని తెలిపింది.

వృత్తి కళాకారులకు, వృద్ధ రైతులకు కూడా రూ. 3వేలు పింఛన్ ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ప్రధానంగా వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు వినూత్న పథకం ప్రకటించింది. పాత స్కూటర్, ఆటో, సెవన్ సీటర్ ఆటో, పాఠశాల వాహనాలన్నింటినీ తీసుకొని కొత్త వాహనాలు అందిస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయరంగానికి ఇచ్చినట్టుగానే చిన్న పరిశ్రమలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించింది. రైతులకు ఒకే విడతలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

బీసీల కోసం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదే విధంగా ఓబీసీల ఏబీసీడీ వర్గీకరణ రిజర్వేషన్ల ప్రక్రియను 9వ షెడ్యూల్‌లో చేరుస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ రూపొందించే ఎన్నికల ప్రణాళిక కోసం సలహాలు, సూచనలు ఇచ్చే వారు ‘bjpmanifesto@gmail.com’కు పంపించ వలసిందిగా కోరింది.