క‌మ‌ల్‌నాథ్ ప్రభుత్వం రాజ్యసభ గండం గట్టెక్కేనా!

మధ్య ప్రదేశ్ లో బొటాబొటి ఆధిక్యతతో నెగ్గుకు వస్తున్న కమల్‌నాథ్‌   ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి డబ్బు వెదజల్లుతున్నదని అంటూ కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అందుకోసం రూ 100 కోట్లతో ఒక పధకం సిద్ధం చేశారని అంటూ ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అయితే ఆ వీడియో నకిలీదని బిజెపి కొట్టిపారవేసింది. 

ఇంతలో సుమారు 10 మంది ఎమ్యెల్యేలు కనిపించకుండా పోవడంతో కాంగ్రెస్ లో ఖంగారు బయలుదేరింది. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురితో పాటు, మద్దతు ఇస్తున్న ఒకరు స్వతంత్ర, ఒకరు ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ సభ్యులు ఉన్నట్లు చెబుతున్నారు. 

ఆరుగురిని ఎమ్మెల్యేలను హరియాణాలోని ఓ హోటల్‌కు, మిగిలిన నలుగురిని బెంగళూరుకు బీజేపీ నేతలు తరలించినట్లు ప్రచారం జరిగింది. వీరిలో ఆరుగురిని కాంగ్రెస్‌ నేతలు తిరిగి రప్పించారు. అయితే ఇదంతా రాజ్యసభ సీట్ కోసం కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఫలితం అని తెలుస్తున్నది. 

దిగ్విజయ్ సింగ్ ప్రత్యర్థిగా పేరొందిన రాష్ట్ర అటవీ ఉమాంగ్ సింగర్ ఇదంతా అంతర్గతంగా జరుగుతున్న నాటకమే అని పెక్రోనడం గమనార్హం. ప్రస్తుతం ఎంపీ నుండి మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ రెండు, బీజేపీ ఒక సీట్ గెల్చుకొనే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి ప్రత్యర్ధులు దిగివజాయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభ సీట్లకోసం పోటీ పడుతున్నారు. వారిద్దరూ మొన్నటి లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందగా, దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం ఈ నెలలోని ముగియనున్నది. 

2017లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోవడంతో దిగ్విజయ్ సింగ్ పట్ల రాహుల్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే వీరిలో ఒకరికి మాత్రమే సీట్ ఇచ్చి, మరొకరు కొత్తవారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నారు. 

కాంగ్రెస్ లో గల కుమ్ములాటలు ఆసరాగా తీసుకొని, రెండు అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తున్నది. అప్పుడు కాంగ్రెస్ నుండి ఒక్కరు మాత్రమే గెలుపొందగలరు. కాంగ్రెస్ ఎమ్యెల్యేలు `అపహరణ'కు గురవుతున్నట్లు దిగ్విజయ్  సింగ్ చెప్పడమే గాని ముఖ్యమంత్రి నోరు మెదపక పోవడం గమనార్హం. 

రెండు స్థానాలు ఖాళీగా  ఉండగా,ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో గల 228 మంది ఎమ్యెల్యేలలో కాంగ్రెస్ కు 114 మంది, బిజెపికి 107 మంది ఉన్నారు. మరో నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు ఎస్పీ సభ్యులు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు.