కరోనా దెబ్బతో నమస్తే ... నమస్తే 

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిని తట్టుకోవడానికి భారతీయ ఆచార వ్యవహారాలను అనుసరించాలని ఇప్పుడు సర్వత్రా గుర్తిస్తున్నారు. తాజాగా, ఇతరులను కలిసినప్పుడు కరచాలనం చేయడాన్ని కొన్ని రోజులపాటు విడిచిపెట్టాలని.. భారత ప్రజలు పలకరింపులకు వాడే ‘నమస్తే’ విధానాన్ని పాటించాలని తమ దేశ ప్రజలకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెత న్యాహూ సలహానిచ్చారు. 

కరోనా వైరస్ దెబ్బతో మన పార్లమెంట్ సభ్యులు సహితం ఒకరికొకరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం మానేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపీలు ‘‘షేక్ హ్యాండ్ వద్దు.. నమస్తే ముద్దు” అంటూ రెండు చేతులు జోడించి పలుకరించు కోవడం కనిపిస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సహితం లాబీల్లో కలుసుకున్నాప్పుడు ఇతర ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుందామని సూచించారు. 

కరోనా వైరస్ కారణంగా షేక్ హ్యాండ్స్‌ను కొంత కాలం మానేయడమే మంచిదని చెబుతున్నారు. చైనాలో కాళ్లతో పలకరించుకునే పరిస్థితి వచ్చిందని, మనకు అలాంటి పనిలేదని తెలిపారు. సంప్రదాయం ప్రకారం నమస్కారం (చేతులు జోడించి ) చెప్పుకుంటే సరిపోతుందని, అదే ఆరోగ్యానికి గొప్ప కానుకని సూచించారు. 

మాస్క్ ధరించి వచ్చిన ఎంపీ నవనీత్ టాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ముఖానికి మాస్క్ ధరంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. కరోనాపై అవగాహన కల్పించేందుకే తాను ఇలా వచ్చినట్లు ఆమె మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. 

ఏ చిన్న పొరపాటు చేసినా వైరస్ విజృంభించే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు ప్రజలు నివారణ చర్యలు పాటించాలని ఆమె హితవు చెప్పారు. పార్లమెంట్ సభ్యులందరికీ స్క్రీనింగ్ చేయాలని, ప్రజలకు సబ్సిడీపై మాస్కులు అందజేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.