శాస్త్రవేత్తల ద్వయానికి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి

మానవ శరీరంలోని సహజ సిద్ధమైన వ్యాధినిరోధక వ్యవస్థ సహాయంతో క్యాన్సర్‌ను జయించే విధానాన్ని కనుగొన్న ఇద్దరు శాస్త్రవేత్తలను వైద్యశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన జేమ్స్ పీ అలిసన్, జపాన్‌కు చెందిన టసూకు హోంజో 2018 సంవత్సరానికిగాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. అంతర్గత రోగనిరోధకశక్తి నియంత్రణ ద్వారా ప్రాణాంతక వ్యాధికి వీరు కనుగొన్న చికిత్సా విధానం విప్లవాత్మకం.

వందేండ్లుగా క్యాన్సర్‌ను నిరోధించే చికిత్సావిధానాలపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు సాగుతున్నాయి. అలిసన్-హోంజో పరిశోధన క్యాన్సర్ చికిత్సలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది అని ప్రశంసించిన నోబెల్ అసెంబ్లీ ఆఫ్ కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ వీరిని ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసింది.

అలిసన్, హోంజో జంటకు 10.1లక్షల అమెరికన్ డాలర్ల (రూ.7.36కోట్లు) నగదు బహుమతిని డిసెంబర్ 10న స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో అందజేయనున్నారు. టెక్సాస్ విశ్వవిద్యాలయ ఇమ్యునాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న అలిసన్(70) అండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లో ఇమ్యునోథెరపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నారు. ఇక టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హోంజో(76) క్యాన్సర్ ఇమ్యునోథెరపీపై పరిశోధనలు సాగిస్తున్నారు.

ఏటా లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న అత్యంత ప్రమాదకర క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం అలిసన్-హోంజో ద్వయం వినూత్న పద్ధతిని అభివృద్ధి చేశారు. నేరుగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేసే చికిత్స విధానాలే ఇప్పటివరకు అమలవుతున్నాయి. వాటికి భిన్నంగా మానవ శరీరంలో సహజంగా ఉన్న రోగనిరోధకశక్తిని ఉపయోగించి త్వరితంగా క్యాన్సర్‌ను నిర్మూలించడంపై వారు ప్రధానంగా పరిశోధనలు సాగించారు. అలా ఇమ్యూనో చెక్‌పాయింట్ల విధానాన్ని వీరు తెరపైకి తెచ్చారు.

రోగనిరోధక చికిత్సావిధానం (ఇమ్యునోథెరపీ)గా పిలిచే ఈ ప్రక్రియలో రోగి శరీరంలోని ప్రొటీన్‌ను ఉపయోగించి.. రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను నిర్మూలించేలా చేయడాన్ని వారు కనుగొన్నారు. జేమ్స్ పీ అలిసన్.. రోగనిరోధక వ్యవస్థలో ఒక బ్రేక్ (అంతరాయం)గా పనిచేసే సీటీఎల్‌ఏ-4 కణాన్ని అధ్యయనం చేశారు. ఇది.. రోగనిరోధక శక్తిలో కీలకంగా వ్యవహరించే టీ-సెల్స్ (కీలకమైన తెల్లరక్త కణాల్లాంటివి)కు అడ్డుగోడలా వ్యవహరిస్తుంది. అది ఓ బ్రేక్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే దాని అడ్డుతొలిగేలా చేస్తామో అప్పుడు టీ-సెల్స్ నేరుగా ట్యూమర్లపైకి దాడిచేస్తాయి.

వాటిని క్రమంగా అంతమొందిస్తాయి అని అలిసన్ తెలిపారు. అదే సమయంలో టసూకు హోంజో కూడా ఇలాంటి ప్రక్రియనే కనుగొన్నారు. శరీరంలోని పీడీ-1 అనే ప్రొటీన్‌పై అయన పరిశోధనలు చేశారు. వ్యాధి నిరోధకకణాల్లో ఉంటూ బ్రేక్‌లా పనిచేసే పీడీ-1 ప్రొటీన్ కూడా క్యాన్సర్‌తో పోరాడే విధంగా హోంజో ఫార్ములాను తయారు చేశారు.

ఈ ఇద్దరూ ట్యూమర్ కణాలను నిర్మూలించేందుకు అభివృద్ధి చేసిన కొత్త తరహా పద్ధతి క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల చికిత్సలో విప్లవాత్మక మార్పుల్ని, మేలైన ఫలితాలను తీసుకువచ్చింది. వీరి పరిశోధన ఆధారంగా తయారైన రోగనిరోధక కణాలను పెంపొందించే మందులకు 2011లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదముద్ర వేయడంతో అవి వైద్యులకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ విధానం వేలాదిమంది క్యాన్సర్‌ను జయించేలా చేయగలిగింది. నా పరిశోధన ఈ దిశగా సాగుతుందని ఊహించలేదు. నోబెల్ ప్రకటించిన వార్త విని గర్వంగా, ఉద్వేగంగా అనిపిస్తున్నది అని అలిసన్ తెలిపారు. నాకు అవార్డును ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను పరిశోధించాల్సిన విషయాలు చాలా మిగిలే ఉన్నాయి. లక్షలాదిమంది రోగులను క్యాన్సర్ నుంచి రక్షించేలా ఇమ్యూనోథెరపీని అభివృద్ధి చేయాల్సి ఉంది అని టసూకు హోంజో చెప్పారు.