దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలో కరోనా కలకలం  

చైనాను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడు తక్కిన దేశాలపై తన పంజా విసురుతున్నది. చైనాలో కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గగా.. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలో విజృంభిస్తున్నది. 

చైనా వెలుపల 80% కొత్త కరోనా కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 91,700 మందికి వైరస్‌ సోకింది. 

చైనా వెలుపల ఇరాన్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 92 మంది కరోనాతో మృతిచెందినట్లు, మరో 2,922 మందికి వైరస్‌ సోకినట్లు ఇరాన్‌ బుధవారం ప్రకటించింది. 

ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 107కు పెరిగింది. దీంతో మార్చి 15 వరకు దేశంలోని బడులు, యూనివర్సిటీలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణకొరియాలో బెడ్‌ల కొరత తీవ్రంగా ఉన్నది. ఆ దేశంలో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 5,621 మందికి వైరస్‌ సోకింది. 

చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నది. బుధవారం కొత్తగా 119 కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇప్పటివరకు 2,981 మంది ప్రాణాలు కోల్పోగా, 80,270 మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో 95 శాతం, కేసుల్లో 85 శాతం చైనాలోనే నమోదయ్యాయి.  

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఇరాక్‌లో తొలి మరణం నమోదుకాగా, పోలాండ్‌లో తొలి కేసు వెలుగులోకి వచ్చింది. భారత్‌, ఇండొనేషియా, థాయ్‌లాండ్‌లలో కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో వైరస్‌ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆగ్నేయాసియా దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.