దేశ వ్యాప్తంగా 28 కరోనా కేసులు   

బృందాలు పంపిస్తామని హర్షవర్దన్‌ తెలిపారు. దేశ వ్యాప్తంగా 28 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆగ్రాలో 6, కేరళలో 3, ఢిల్లీలో 1, తెలంగాణలో మరొక కరోనా కేసు నమోదైందని తెలిపారు. 

కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు పంపిస్తామని హర్షవర్దన్‌ తెలిపారు  

16 మంది ఇటాలియన్లతో పాటు డ్రైవర్‌కు కరోనా సోకినట్టు చెప్పారు. ఇటలీ పర్యాటకులను ఐటీబీపీ శిబిరానికి పంపామని కేంద్ర మంత్రి చెప్పారు. ఢిల్లీలో కరోనా సోకిన వ్యక్తి కుటుంబానికీ వైరస్‌ పాజిటీవ్‌గా తేలిందని చెప్పారు. తెలంగాణలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిశాడని నిర్ధారించామని పేర్కొన్నారు. కరోనా కేసులు నమోదైన 3కి.మీల దూరం శుభ్రత చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. 

విదేశాల నుంచి వచ్చేవారిని స్క్రీనింగ్‌ చేస్తున్నామని చెబుతూ ఇరాన్‌లో కూడా ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఇరాన్‌లోని భారతీయులకు అక్కడే పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు.   

ఇదిలా ఉంటే.. దేశంలో ఇప్పటివరకు 438 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. 189 మంది రిపోర్ట్‌లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 89 మందికి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు కరోనాపై ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనాతో ఇప్పటివరకు 3వేల మందికి పైగా మృతి చెందినట్టు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 90వేల మందికి సోకినట్టు తెలిపింది. కరోనా మాస్క్‌లు, గౌన్లు, వైద్య పరికరాల ధరలు పెరిగిన సందర్భంగా.. ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలు, ప్రభుత్వాలకు డబ్ల్యూహెచ్‌వో విజ్ఞప్తి చేసింది.