మైండ్‌స్పేస్‌ లో కరోనా కలవరం

మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లోని డీఎస్‌ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు తెలిసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించిన యాజమాన్యాలు వర్క్‌ ఫ్రమ్‌ హోకు ఆదేశించాయి. 

పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు కొలువుదీరిన రహేజా మైండ్‌ స్పేస్‌లోని బిల్డింగ్ నంబర్ 20లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ రావడంతో సహోద్యోగులు బెంబేలెత్తిపోయారు. బిల్డింగ్ నంబర్ 20లోని ఐటీ కంపెనీలన్నీ బుధవారం తమ ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి.   

కరోనా పాజిటివ్‌గా తేలిన ఉద్యోగిని డచ్‌కు చెందిన ఐటీ కంపెనీ డీఎస్‌ఎంలో విధులు నిర్వర్తిస్తోంది. దాదాపు మూడు వేల మంది ఇంటికి వెళ్లిపోయారు. కంపెనీ యాజమాన్యం చెప్పేవరకు ఆఫీస్ కు రావద్దంటూ ఆర్డర్స్ జారీచేశాయి పలు కంపెనీలు. దీంతో మైండ్ స్పేస్ పరిసరాలన్నీ భయంతో వణికిపోతున్నాయి.

ప్రస్తుతం మైండ్ స్పేస్ లోకి ఎవరిని కూడా వెళ్లనీయడంలేదు. పొద్దున ఆఫీస్ కు వచ్చినటువంటి ఉద్యోగులను కూడా ఇంటికి పంపించారు. కరోనా భయంతో టెస్ట్ లు చేయించుకోవడానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గాంధీ హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు.   

హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో..  అత్యవసరమైతే తప్ప ఉద్యోగులు ప్రయాణాలు చేయకూడదని సూచించాయి.  కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.

కాగా, హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఇంజినీర్ కి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు వచ్చిన వార్త కలకలం రేపుతోంది.  దక్షిణ కొరియా నుండి తిరిగి వచ్చిన తర్వాత  అతనికి ఈ లక్షణాలున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ టెక్కీని ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆసుపత్రిలో చేర్చారు.  ఏపీలో  ఇప్పటి వరకు 11 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.