ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు     

దేశంలోనూ కరోనా వైరస్‌ కేసులు నమోదవుతుండటంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పారాసిటమాల్‌, మరో 25 ఇతర ఔషధాల ఎగుమతులపై మంగళవారం ఆంక్షలు పెట్టింది. ఎక్కడా, ఎటువంటి మందుల కొరత రాకుండా కనీస ఔషధాల ఎగుమతుల్నీ ఆపేయాలని నిర్ణయించింది.

అలాగే మెట్రోనిడజోల్‌ వంటి  యాంటీబయాటిక్స్‌, బ్యాక్టీరియా, వివిధ ఇన్ఫెక్షన్ల బారినపడకుండా వినియోగించే పలు రకాల మందులు, విటమిన్‌ బీ1, బీ6, బీ12 ఆధారిత ఔషధాలపైనా తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ప్రకటించింది. 

టినిడజోల్‌, సైక్లోవియర్‌, ప్రొజెస్టిరాన్‌, క్లోరాఫెనికాల్‌, ఆర్నిడజోల్‌, నియోమైసిన్‌, సిలిండమైసిన్‌ సాల్ట్స్‌ ఫార్ములేషన్లపైనా ఆంక్షలు వర్తిస్తాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ఫిబ్రవరిలోనే 12 ఏపీఐలు, ఫార్ములేషన్ల ఎగుమతులపై ఆంక్షలు విధించాలని డీజీఎఫ్‌టీని ఔషధశాఖ కోరింది. పరిస్థితులు మరింత దిగజారుతున్న సంకేతాలు రావడంతో ఇప్పుడు ఏకంగా 26 రకాల ఏపీఐలు, ఫార్ములాలపై ఆంక్షల్ని తెచ్చారు. 

నిజానికి జనరిక్‌ ఔషధాల తయారీలో భారత్‌దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జనరిక్‌ ఔషధాల సరఫరాలో భారత్‌ వాటా 20 శాతంగా ఉన్నది. అయితే వీటి తయారీకి కావాల్సిన ముడి పదార్థాల్లో మూడింటా రెండు వంతులు చైనా నుంచే వస్తున్నాయి. 

కానీ కరోనా వైరస్‌ గుప్పిట్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా.. ఇప్పుడు వీటిని ఇతర దేశాలకు సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నది. కర్మాగారాలన్నీ మూతబడటంతో అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అందుకే ఔషధ ఎగుమతులపై ఆంక్షలను తెచ్చారు.