కరోనాపై ఆందోళన వద్దు... ప్రధాని అభయం 

కరోనా వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ర్టాలు కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్‌లో ప్రధాని పేర్కొన్నారు. 

ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి.. సరైన వైద్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. 

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన ట్విట్టర్ అకౌంట్ ను మహిళలకే అంకితమిస్తున్నట్లు మోదీ చెప్పారు.  ప్రేరణాత్మకంగా నిలిచిన మహిళల కథనాలను ఆ రోజున ట్వీట్ చేయనున్నారు. 

లక్షలాది మంది మహిళలకు ఈ కథనాలు ప్రేరణగా నిలుస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మీకు అలాంటి మహిళల కథనాలు తెలిస్తే తమకు షేర్ చేయాలని ప్రధాని సూచించారు. 

ఇలా ఉండగా, భారత్‌లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కి వచ్చిన ఇటలీ టూరిస్టు వైరస్ లక్షణాలతో శనివారం ఆస్పత్రిలో చేరాడు. అతడికి టెస్టులు చేసిన తర్వాత కరోనా ఉన్నట్లు తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.   

ఇప్పటికే కేరళలో ముగ్గురికి కరోనా రావడంతో చికిత్స తీసుకుని.. పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. సోమవారం కొత్తగా ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వచ్చింది. ఆ ఇద్దరు కూడా కరోనా వ్యాప్తి చెంది ఉన్న ఇటలీ, దుబాయ్ దేశాల నుంచి భారత్‌ వచ్చిన వారే. ఇవాళ రాజస్థాన్‌లో మరో పేషెంట్‌తో కలిపి ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరింది.  

మరోవినక, కరోనా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటలీ, ఇరాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చేవారికి..భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటలీ, చైనా, ఇరాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియ దేశాలలో..అనవసర పర్యటనలు చేయకూడదంటూ భారత పౌరులకు కేంద్రం సూచింది. 

చైనా, దక్షిణకొరియా, ఇరాన్‌, ఇటలీ, హాంకాంగ్‌, మకావ్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్‌, థాయిలాండ్‌, సింగపూర్‌, తైవాన్‌ నుంచి వచ్చేవారికి..మెడికల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన తర్వాతే అనుమతి ఇవ్వాలని కేంద్రం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.