వచ్చే ఎన్నికల్లో అన్ని రికార్డులను బద్దలు కొడతాం

2019 ఎన్నికల్లో ఎన్డీయేకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని, అన్ని రికార్డులను తాము బద్ధలు కొడతామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసారు. ఓ పత్రికకు ఆయన ప్రత్యేకంగా ఈ-మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ పౌరుల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టంచేశారు.

“గతంలో ఎన్డీయేకు ఎప్పుడూ రానన్ని సీట్లు ఈసారి గెలుస్తాం. గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రజలు మాతోనే ఉన్నారు. మేము దేనికీ భయపడటం లేదు” అని మోదీ విశ్వాసం వ్యక్తం చేఅసారు. ఇప్పటివరకు వస్తున్న సర్వేల్లో మరోసారి మోదీయే ప్రధాని కాబోతున్నారని తేలినా దేశంలో మైనార్టీలు, దళితులపై జరుగుతున్న దాడులు మోదీ చరిష్మాను తగ్గించాయని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారవేసారు.

కర్ణాటకలో అధికారం చేపట్టడంలో విఫలమవడంతోపాటు ఈ మధ్య జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. “నా నినాదం కేవలం అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి, అందరి అభివృద్ధి.. గత నాలుగేళ్లుగా చాలా కష్టపడి పనిచేశాం. మా ట్రాక్ రికార్డు చూసి ప్రజలు మాతోనే ఉన్నారు” అని మోదీ స్పష్టంచేశారు.

ప్రతిపక్షాల మహా కూటమి అనేది విఫలమైన ఆలోచన అని చెప్పారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించవని ధీమా వ్యక్తం చేసారు. ప్రజలు బలమైన, నిర్ణయాలు తీసుకోగలిగిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారని చెప్పారు. సత్ఫలితాలిచ్చే ప్రభుత్వం కేంద్రంలో ఉండాలనుకుంటున్నారని తెలిపారు. సిద్ధాంతాలేవీ లేని నిరాశావాదుల కూటమి మహా కూటమి కాబోదని ఎద్దేవా చేసారు.

2014 ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. 1984 తర్వాత ఒకే పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.