హైదరాబాద్ తో సహా రెండు క‌రోనా పాజిటివ్ కేసులు

దేశంలో తాజాగా రెండు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. ఢిల్లీతో పాటు హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తుల‌కు ఆ వైర‌స్‌ సోకిన‌ట్లు తేల్చారు.  దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా సోకిన వ్య‌క్తుల సంఖ్య 5కు చేరుకున్న‌ది.  కరోనా సోకిన ఇద్ద‌రి ట్రావెల్ హిస్ట‌రీని కూడా మంత్రి వెల్ల‌డించారు.

ఇటలీ నుంచి వచ్చిన న్యూఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి, దుబాయ్ నుంచి తెలంగాణ వచ్చిన మరొకరికి కరోనా సోకిందని తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందుతోందని పేర్కొన్నా

గతంలో కేరళకు చెందిన ముగ్గురు కరోనా బారిన పడ్డారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి అక్కడి అధికారులు చికిత్స అందించిన తర్వాత పూర్తి కోలుకోవడంతో డిశ్చార్జ్ కూడా చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కేకే శైలజ గతంలో ప్రకటించారు.  

ప‌రిస్థితి ముదురుతున్న నేప‌థ్యంలో.. మ‌రికొన్ని దేశాల‌కు ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను పెంచిన‌ట్లు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పారు.  21 విమానాశ్ర‌యాల్లో, 12 సీపోర్ట్స్‌, 65 మైన‌ర్ సీపోర్ట్‌ల వ‌ద్ద స్క్రీనింగ్ చేప‌డుతున్నార‌ని మంత్రి తెలిపారు.  ఇప్ప‌టి వ‌ర‌కు 5 ల‌క్ష‌ల 57 వేల మందికి విమానాశ్ర‌యాల వ‌ద్ద‌ స్క్రీనింగ్ చేసిన‌ట్లు చెప్పారు.  

చైనా, ఇరాన్ దేశాల‌కు ఈ-వీసాల‌ను ర‌ద్దు చేశారు.  చైనా, ఇరాన్, కొరియా, సింగ‌పూర్‌, ఇట‌లీ లాంటి దేశాల‌కు ప్ర‌యాణాల‌ను నిలిపివేయాల‌ని మంత్రి కోరారు.