కరోనా మృతితో వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరంలోని కిర్క్‌లాండ్‌లో ఒక యువకుడు కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో మరణించడంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో ఇప్పటికే దాదాపు 50 మందికి పైగా కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ బారిన పడి వైద్య చికిత్స అందుకుంటున్న విషయం తెలిసిందే. 

ఈ కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ను సమూలంగా నిర్మూలించేందుకు 'అందుబాటులో వున్న అవసరమైన అన్ని వనరుల'ను ఉపయోగించుకోవాలని గవర్నర్‌ ప్రభుత్వ సంస్థలకు ఆదేశించారు. ఈ సేవలకు అవసరమైతే వాషింగ్టన్‌ నేషనల్‌ గార్డ్‌ దళాలను కూడా రంగంలోకి దించాలని ఆయన సూచించారు. ఇకపై కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో ఒక్కరు కూడా మృతి చెందకుండా చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ చెప్పారు. 

చైనాలోని కరోనా ప్రభావిత ప్రాంతాలను సందర్శించటం, లేదా అక్కడి పేషెంట్లతో సంబంధాలు పెట్టుకోవటం వంటి చరిత్ర ఎవరికీ లేకపోయినప్పటికీ, అమెరికా పశ్చిమ తీర ప్రాంతంలో ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కాలిఫోర్నియా, ఓరేగాన్‌, వాషింగ్టన్‌ తదితర రాష్ట్రాల ఆరోగ్య అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.