పోలవరం నిర్వాసితులను కుదించే ప్రయత్నం

వచ్చే సంవత్సరం ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, కాలువలో నీటిని విడుదల చేస్తామని చెబుతున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్ట్ లో కీలకమైన నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లింపు అంశాలపై దుష్టి సారించడం లేదు. ఈ విషయమై ఖచ్చితమైన నివేదికలు కుడా సిద్దం కాలేదని కాగ్ సహితం తన నివేదికలో ఎత్తి చూపింది.

నిర్వాసితులు అందరికి చట్టం ప్రకారం పునరావాసం కల్పించే ప్రయత్నం చేయవలసిన ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వాసితుల గుర్తింపు కుడా సమగ్రంగా చేయనే లేదు. పైగా నిర్వాసితుల సంఖ్యను కుదించి, తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు, నిరసనలు చెలరేగుతున్నాయి. ఏదో వంక జాబితాల నుండి పేర్లను తొలగిస్తూ వడపోత కార్యక్రమాన్ని చేపట్టిన్నట్లు వెల్లడి అవుతున్నది. దీంతో నిర్వాసితులు పడరాని పాట్లు పడుతున్నారు.

అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు కంటే, కుడి గట్టు వైపు నిర్వాసితులు అగచాట్లు అధికంగా ఉన్నాయి. ముంపునకు గురయ్యే పల్లపు భూములకు కాకుండా మెరక భూములకు నష్ట పరిహారం ఇస్తూ అధికారులు ఇష్టారాజ్యంగా కొత్త పుంతలు తొక్కారు. చెంతనే ఉన్న భూములకు అధికారులు మొండి చేయి చూపడంతో నష్టపోయిన నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎన్నిసార్లు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆదివాసీ నిర్వాసితుల మొర ఆలకించే వారు కనిపించడం లేదు.

విలీన మండలాల్లోని చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లోనూ, దేవీపట్నం మండలంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బూర్గంపహాడ్ మండలంలో కొంత భాగం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో అనేక మంది నిర్వాసితులకు సక్రమంగా పరిహారం అందని పరిస్థితి దాపురించింది. కొంతమందికి రేషన్ కార్డు లేదని, మరి కొంత మందికి రేషన్ కార్డు ఉన్నా సక్రమంగా సరుకులు తీసుకోవడం లేదని, కొంత మందికి ఆధార్‌కార్డు లేదని, ఆధార్ కార్డు ఉన్నా అడ్రస్ స్థానికంగా లేదని, ఓటర్ ఐడి కార్డు లేదని ఇలా వందలాది మంది పేర్లను అర్ అండ్ ఆర్ జాబితా నుంచి తొలగించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రాజధాని అమరావతి విషయంలో భూములిచ్చినవారికి సకల సదుపాయాలు కల్పించి పరిహారం చెల్లిస్తుంటే, ఇక్కడ సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు మాత్రం సక్రమంగా పరిహారం కూడా అందించడం లేదు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టుగా ఉంది. 2013 చట్టం ప్రకారం పరిహారం అనేది ఎక్కడా సక్రమంగా అమలైన దాఖలాలు కన్పించడం లేదు. నిర్వాసితులను ఏదో విధంగా వడబోస్తున్నారు. దీనికి తోడు భూసర్వే కూడా తప్పుల తడకగా సాగిందని విమర్శలు చెలరేగుతున్నాయి.

గోదావరి చెంతనే ముంపులో ఉండే భూములకు పరిహారం లేకుండా, మెరకలో వున్న భూములకు పరిహారం అందిస్తున్నారని, పొలంలో ఉన్న ఇల్లు మునిగిపోతుందని పరిహారం ఇస్తే అదే పొలానికి మాత్రం పరిహారం జాబితా నుంచి తొలగిస్తున్నారని పలువురు గగ్గోలు పెడుతున్నారు. వారి రోదన వినే నాధుడే కనిపించడం లేదు. నిర్వాసితులు దూర ప్రాంతాల నుంచి అధికారుల వద్దకు వచ్చి తమ గోడు చెప్పుకోవాలంటే నిర్వాసితులకు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి రావడానికి, తిరిగి ఇంటికి వెళ్లడానికి రెండు రోజుల పని. తీరా పని మానుకుని వస్తే అధికారులు అందుబాటులో ఉండని పరిస్థితులు నెలకొన్నాయి.

చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల నుంచి ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే రంపచోడవరం రావాల్సిందే. నిర్వాసితులకు అందుబాటులో వుండేందుకు కుకునూరు మండలంలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కార్యాలయం తూతూ మంత్రంగా నడుస్తోంది. అక్కడ రికార్డు లేదు. ఇద్దరు సిబ్బందిని పెట్టి నడిపిస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోవాలంటే బాధితులకు అధికారులు అందుబాటులో ఉండరు.

దీంతో ఎడమ గట్టు వైపు నిర్వాసితులంతా కేఆర్ పురంలో పడిగాపులు కాస్తున్నారు. కనీసం మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొన్నది. తిరిగి ఇంటికి పోదామనుకుంటే.ఆరు దాటితే ఇక బస్సు ఉండదు. కెఆర్ పురం ఐటీడీఏ పీవోకే పునావాస కల్పన కార్యకమాన్ని నిర్వహిస్తున్నారు. కెఆర్ పురం బాధితులంతా రావాలంటే వ్యయ ప్రయాసలకోర్చి రావాల్సిందే.