తెలంగాణలో ఓసి లకు రిజర్వేషన్లు : బిజెపి

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే ఆర్ధికంగా వెనుకబడిన ఓసీలకు రిజర్వేషన్లను కల్పించే యోచన చేస్తామని బిజెపి రాష్ట్ర శాఖ అద్యక్షుడు డా. కె లక్ష్మణ్ తెలిపారు. అయితే మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్ వర్తించదని స్పష్టం చేఅసారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల ‘ప్రజా మెనిఫెస్టో’ రూపకల్పన కోసం లక్ష్మణ్ ఆదివారం ప్రజలతో సోషల్ మీడియా వేదికగా  చర్చించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ఆయన నోట్ చేసుకున్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు జనాభకు అనుగుణంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

బీసీల సంక్షేమం కోసం బీసీ డిక్లరేషన్‌ అమలు చేస్తామని, ఎంబీసీలను గుర్తిస్తామని చెబుతూ మాదాసీ కురువలను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ప్రకటించారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామని చెప్పారు.

ఆర్టీసీని ప్రభుత్వ పరిధిలోకి తెస్తామని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని, తద్వార పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

చాకలి అయిలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తామని, తెలంగాణ పోరాటయోధులందరీ విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  కార్పోరెట్ విద్యను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. యోగా, తెలంగాణ అమరులు పోరాటాలను పాఠ్యాంశంగా చేరుస్తామని చెప్పారు.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా చేస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎయిడెడ్ టీచర్ల వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. ప్రయివేటు విద్యా సంస్థలపై పన్నులు తగ్గించి విద్యను సామాన్యుడికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కల్లుగీత కార్మికుల కోసం నీరాను ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.  రైతులకు సాయల్ హెల్త్ కార్డులు అందించడంతో పాటు వారికి ప్రత్యేకంగా హెల్త్ కార్డులు అందిస్తామని చెప్పారు. అర్హులైన వారికి మూడెకరాల చొప్పున పంపిణీ చేసే అంశంపై చర్చించి మెనిఫెస్టోలో చేరుస్తామని ప్రకటించారు.

మద్యాన్ని పూర్తిగా నిషేధించం కాకుండా నియంత్రించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు ఒకే విడతలో రూ. 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం పూర్తిగా కల్పిస్తామని లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. వ్యవసాయాన్ని పండుగగా చేస్తామని చెబుతూ పట్టాదార్ పాస్‌పుస్తకాలను ఉచితంగా అందిస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు రుణమాఫీ అంశంపై చర్చిస్తామని ప్రకటించారు.

హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు కాకుండా భక్తుల చేతుల్లో ఉండే విధంగా ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇప్పిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మైనార్టీలను ఆర్ధికంగా బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్‌లో మురుగునీటి వ్యవస్థను సమూలంగా మారుస్తామని చెప్పారు. మూసి నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు.

సింగరేణి కార్మికులకు సంబంధించి వారసత్వ ఉద్యోగాలను కల్పిస్తామని చెబుతూ కాంట్రాక్ట్ కార్మకులకు కనీస వేతనం అందించే విధంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లను ప్రణాళిక ప్రకారం నిర్మిస్తామని తెలిపారు. నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తామన్నారు. వృత్తి విద్యను ఆధునీకరిస్తామని తెలిపారు.

మిషన్ కాకతీయలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని లక్ష్మణ్  ప్రకటించారు. మెట్రో రైలు చార్జీలను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితుల కోసం ఎన్నారై పాలసీ తెస్తామని ఆయన స్పష్టం చేశారు. సమభావన సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. దివ్యాంగుల కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, వారిని అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.