సోనియాజీ రాజధర్మం పాఠాలు చెబుతారా!

ఢిల్లీ హింసాకాండ సమయంలో తన బాధ్యతలు సరిగా నిర్వర్తించనందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేయడం పట్ల కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. తమకు రాజధర్మం నేర్పడానికి ప్రయత్నించొద్దని చురకలంటించారు.

కాంగ్రెస్ పాలన మొత్తం ఓటు బ్యాంకు రాజకీయాలతో నిండిపోయిందని ఆరోపించారు. అలాంటప్పుడు తమకు నీతిబోధలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో హింసాకాండ నేపథ్యంలో ఇటీవలే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సోనియా కలిసి ఢిల్లీ హింసాకాండ సమయంలో తన బాధ్యతలు సరిగా నిర్వర్తించనందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 

ఈ విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు నోరు మెదపడంలేదని, మూగ ప్రేక్షకుల్లా ప్రవర్తిస్తున్నాయని ఆమె విమర్శించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి రాష్ట్రపతి పూనుకోవాలని, కేంద్రానికి రాజధర్మం మూలాలను గుర్తుచేయాలని కోరుతూ కోవింద్‌కు ఓ వినతి పత్రం  సమర్పించారు. 

దీనిపై రవిశంకర్ స్పీనదిస్తూ కాంగ్రెస్ పాలన మొత్తం అల్లర్లు, ఓటు బ్యాంకు రాజకీయాలేనని దుయ్యబట్టారు. తమకు రాజధర్మం నేర్పడానికి ప్రయత్నించొద్దని చెప్పారు. శాంతి కోసం కలిసికట్టుగా ప్రయత్నించాల్సిన ఇటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. 

ఢిల్లీ అల్లర్లు జరిగిన రోజు నుంచి హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారని, ఈ హింసాకాండకు కారణమైన ఎవరినీ వదిలేది లేదని స్పష్టంచేశారు.