సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని మోడికి ఆహ్వానం

గత ఎన్నికలలో వారణాసి నుండి నరేంద్ర మోడీ పోటీ చేయడం ద్వారా ఉత్తర ప్రదేశ్ లో బిజెపి ఘన విజయం సాధించి, కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే అవకాశం రావడంతో ఈ సారి పార్టీ దృష్టి దక్షిణాదిపై పడుతున్నది. ఉత్తరాది రాష్త్రాలలో తగ్గడానికి అవకాశం ఉన్న సీట్లను దక్షిణాదిన భర్తీ చేసుకోవాలని పార్టీ ఆలోచిస్తూ ఉండడంతో ప్రధాని మోడీ స్వయంగా ఏదో ఒక నియోజక వర్గం నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై పడే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై పార్టీ నాయకత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాన మంత్రిని  ఆహ్వానించినట్లు తెలిసింది. దత్తాత్రేయ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసినప్పుడు ఈ ప్రతిపాదన చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేయటం వలన మొత్తం దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలపై ప్రభావం పడుతుందని, పార్టీకి బాగా కలిసి వస్తుందని దత్తాత్రేయ వాదిస్తున్నట్లు తెలిసింది. నరేంద్ర మోదీ  సికింద్రాబాద్ లేదా దక్షిణాదిలోని మరేదైన నియోజకవర్గం నుండి పోటీ చేయటం వలన పార్టీకి రాజకీయంగా బాగా కలిసి వస్తుందని బీజేపీ అధినాయకులు కూడా అంచనా వేస్తున్నారు.

గతంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్, కర్నాటకలోని చిక్‌మంగళూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయటం తెలిసిందే. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ లాంటి ఉత్తరాది పార్టీ అధినాయకుడు దక్షిణాది నుండి పోటీ చేయటం వలన ఈ ప్రాంతంలోని రాష్ట్రాల్లో బీజేపీకి బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.

వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోదీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి పోటీ చేసేందుకు ఏమేరకు ఇష్టపడతారో చూడవలసి ఉంది.